Supreme Court: ఊహాజనిత తీర్పులు సరికాదు: మహిళకు విధించిన జైలు శిక్షను రద్దుచేసిన సర్వోన్నత న్యాయస్థానం
- అనుమానాస్పద స్థితిలో భర్త మృతి చెందినా ఏడవ లేదని భార్యపై కేసు
- ఆమే చంపేసి ఉంటుందన్న పోలీసుల వాదనతో ఏకీభవించి శిక్ష విధించిన గువాహటి న్యాయస్థానం
- సరైన విచారణ లేకుండా తీర్పు ఇచ్చారని తప్పుపట్టిన సుప్రీం కోర్టు
భర్త మృతదేహం పక్కనే కూర్చున్నా ఆమె కంట కన్నీటి బొట్టు రాలలేదు. ‘ఆమె నేరం చేసిందనేందుకు ఇంతకంటే ఆధారం ఏం కావాలి?’ అంటూ పోలీసులు చూపిన అత్యుత్సాహం ఐదేళ్లపాటు ఆమెకు జైలు జీవితాన్ని మిగిల్చింది. కేసు తీర్పును పరిశీలించిన అత్యున్నత న్యాయస్థానం ‘లోతైన విచారణ లేకుండా ఊహాజనిత తీర్పులు ఇవ్వడం సరికాదు’ అని పేర్కొంటూ ఆమెకు విధించిన జైలు శిక్షను రద్దు చేసింది.
వివరాల్లోకి వెళితే... అసోంకు చెందిన ఓ మహిళ భర్త ఐదేళ్ల క్రితం అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. భర్త మృతదేహం పక్కనే కూర్చున్న భార్య కనీసం ఏడవక పోవడంతో పోలీసుల అనుమానం ఆమెపైకి వెళ్లింది. ఆమే కోపంతో చంపేసి ఉంటుందన్న అనుమానంతో అరెస్టు చేసి న్యాయస్థానం ముందు హాజరు పరిచారు. పోలీసుల వాదనతో ఏకీభవించిన న్యాయస్థానం ఆమెకు జైలు శిక్ష విధించింది.
నిజానిజాలు తెలుసుకోకుండా, సరైన దర్యాప్తు జరపకుండానే ఆమెకు శిక్ష విధించారంటూ బాధితురాలి తరపున ఆమె బంధువులు సుప్రీం కోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేశారు. కేసును పరిశీలించిన నారిమన్, నవీన్ సిన్హా ధర్మాసనం బుధవారం మహిళకు విధించిన శిక్షను రద్దు చేస్తూ తీర్పు ఇచ్చారు. ‘మృతదేహం పక్కన కూర్చుని ఏడవనంత మాత్రాన ఆమె హంతకురాలు అనుకోవడం సరికాదు. ఆమె హంతకురాలు అనేందుకు సరైన ఆధారాలు లేవు. కావున తక్షణం విడుదల చేయండి’ అంటూ ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఐదేళ్లుగా శిక్ష అనుభవిస్తున్న మహిళకు విముక్తి లభించింది.