Andhra Pradesh: తెలుగుబిడ్డగా నా మనసు క్షోభిస్తోంది.. ‘స్టాచ్యూ ఆఫ్ యూనిటీ’పై స్పందించిన చంద్రబాబు!

  • దేశంలో తెలుగు మూడో అతిపెద్ద భాషగా ఉంది
  • అయినా మా భాషకు చోటు కల్పించలేదు
  • ఇంత వివక్ష చూపాల్సిన అవసరం ఏంటి?

భారత తొలి హోంమంత్రి సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ స్మృత్యర్థం ’స్టాచ్యూ ఆఫ్ యూనిటీ’ పేరుతో ప్రపంచంలోనే ఎత్తయిన విగ్రహాన్ని ప్రధాని మోదీ నిన్న ఆవిష్కరించారు. అయితే శిలాఫలకంలో దక్షిణాది నుంచి కేవలం తమిళ భాషకు మాత్రమే ప్రాధాన్యత కల్పించారు. దీంతో తెలుగు భాషకు శిలాఫలకంపై చోటు కల్పించకపోవడంపై పలువురు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఈ వ్యవహారంపై ఏపీ సీఎం చంద్రబాబు స్పందించారు.


భారత్ లో అత్యధిక ప్రజలు మాట్లాడే మూడో భాషగా తెలుగు ఉందనీ, అలాంటి భాషకు ‘స్టాచ్యూ ఆఫ్ యూనిటీ’ శిలాఫలకంపై చోటు కల్పించకపోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రోజు ట్విట్టర్ లో స్పందిస్తూ..‘భారతదేశంలో ఎక్కువ మంది మాట్లాడే మూడో అతి పెద్ద భాషయిన తెలుగుకు  #StatueOfUnity శిలాఫలకంపై గుర్తింపు లభించకపోవడంతో తెలుగు తల్లి బిడ్డగా నా మనసు క్షోభిస్తోంది.

పైసా ఖర్చు లేని ఇటువంటి విషయాలలో కూడా తెలుగు వారంటే ఇంత వివక్షా? ప్రతి తెలుగు వారూ అలోచించి, తమ ఆవేదనను వ్యక్తం చేయవలసిన తరుణమిది’ అని చంద్రబాబు ట్వీట్ చేశారు. కాంగ్రెస్ సహా వేర్వేరు పార్టీల నేతలను కలుసుకునేందుకు ఈ రోజు చంద్రబాబు ఢిల్లీ బయలుదేరిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News