Telangana: తెలంగాణ కాంగ్రెస్ నేతకు షాక్.. ఇంటి నుంచి భారీగా మద్యం స్వాధీనం చేసుకున్న పోలీసులు!
- మెదక్ జిల్లా వెల్దుర్తిలో ఘటన
- కేసు నమోదు చేసిన పోలీసులు
- తనకు సంబంధం లేదన్న నేత
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఓటర్లకు తాయిలాలు అందించేందుకు నేతలు సిద్ధమవుతున్నారు. తాజాగా మెదక్ జిల్లా వెల్దుర్తి మండలంలో ఓ కాంగ్రెస్ నేత ఇంట్లో భారీగా మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన అధికారులు ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు.
ధర్మారం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ వెల్దుర్తి అధ్యక్షుడు ఎస్.నర్సింహారెడ్డి ఇంట్లో దాదాపు 83 కార్డన్ల మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మద్యం నిల్వలపై పక్కా సమాచారం అందుకున్న అధికారులు దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై గంగరాజు మాట్లాడుతూ.. కాంగ్రెస్ నేత నర్సింహారెడ్డి ఇంట్లో అక్రమంగా మద్యం నిల్వ చేసినట్లు పక్కా సమాచారం అందిందని తెలిపారు. దీంతో దాడులు నిర్వహించి రూ.4.80 లక్షల విలువైన మద్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేశామనీ, దర్యాప్తు కొనసాగుతోందని పేర్కొన్నారు.
మరోవైపు ఓటర్లకు పంచేందుకే ఈ మద్యాన్ని తెచ్చారన్న ఆరోపణలను కాంగ్రెస్ నేత నర్సింహారెడ్డి ఖండించారు. తన కుటుంబ సభ్యులు ఇంట్లో లేనప్పుడు ఎవరో వీటిని ఇక్కడ పెట్టేసి వెళ్లారని పేర్కొన్నారు. తనిఖీలకు వచ్చిన పోలీసులకు పూర్తిస్థాయిలో సహకారం అందించినట్లు వెల్లడించారు. దీనిపై చట్టపరంగా పోరాడుతానని స్పష్టం చేశారు.