Chandrababu: కాంగ్రెస్ తో కలసి వెళ్లడం సరైనదేనా?.. మంత్రుల ప్రశ్నకు చంద్రబాబు సమాధానం ఇది!
- నాడు కాంగ్రెస్ పార్టీతో సమస్య కాబట్టి విభేదించాం
- నేడు బీజేపీతో అంతకన్నా పెద్ద సమస్య
- ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తుంటే పోరాడాల్సిందేనన్న చంద్రబాబు
బీజేపీకి వ్యతిరేకంగా పోరాటంలో స్పీడు పెంచడమే లక్ష్యంగా ఏపీ సీఎం చంద్రబాబునాయుడు కొద్దిసేపటి క్రితం ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. నేటి మధ్యాహ్నం కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సహా, పలువురు జాతీయ పార్టీల నేతలతో ఆయన సమావేశం కానున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల మంత్రులతో చంద్రబాబు సమావేశమై, తన ఢిల్లీ పర్యటన షెడ్యూల్ గురించి వివరిస్తున్న వేళ, కాంగ్రెస్‌తో కలిసి వెళ్లడం సరైనదేనా? అన్న ప్రశ్న కొందరి నుంచి వచ్చింది.
దీనికి చంద్రబాబు సమాధానం ఇస్తూ, "టీడీపీని తెలుగువారి ఆత్మ గౌరవాన్ని నిలబెట్టేందుకే ఎన్టీఆర్ స్థాపించారు. అప్పట్లో కాంగ్రెస్ తో మాత్రమే సమస్య ఉండేది. నేడు బీజేపీతో అంతకు మించిన సమస్య ఏర్పడింది. తెలుగు వారికి అవమానం జరుగుతోంది. అణచివేస్తున్నారు. మారిన రాజకీయ పరిస్థితుల్లో బీజేపీని అడ్డుకునేందుకు కాంగ్రెస్ తో కలిసి పనిచేస్తే తప్పులేదు. తెలుగు వారి ఆత్మగౌరవవానికి ఎవరి వల్ల ఇబ్బంది తలెత్తినా పోరాడాల్సిందే" అని అన్నారు.
కాగా, నేడు శరద్ నివాసంలో విందు భేటీ జరుగనుండగా, రాహుల్ గాంధీ అక్కడికే రానున్నారు. బీజేపీకి వ్యతిరేకంగా బలమైన కూటమిగా ఆవిర్భవించి, ఇప్పటి నుంచే కలసి సాగాలన్నది చంద్రబాబు అభిమతం. ఈ పర్యటనలో ఫరూక్ అబ్దుల్లా, సీతారాం ఏచూరిలతో కూడా బాబు భేటీ కానున్నారు.