me too: అక్టోబరులో భారతీయులు ఎక్కువగా మాట్లాడుకున్నది దీని గురించేనట!
- గత నెలలో ఎక్కువ చర్చనీయాంశమైన అంశంగా ‘మీటూ’
- వెల్లడించిన ‘మెల్ట్‌వేర్’
- హాలీవుడ్‌లో మొదలై ప్రపంచవ్యాప్తమైన ‘మీటూ’ ఉద్యమం
అక్టోబరు నెలలో దేశంలో ఎక్కువగా చర్చనీయాంశమైన అంశం ఏదో తెలుసా? ‘మీటూ’. గత నెలలో భారతీయులు ఎక్కువగా చర్చించుకున్న అంశం ఇదేనని గ్లోబల్ మీడియా ఇంటెలిజెన్స్ సంస్థ ‘మెల్ట్‌వేర్’ పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా చర్చకు వచ్చిన అంశాల్లో 25 శాతం ‘మీటూ’ గురించేనని తెలిపింది. అమెరికాలో 22 శాతం మంది ఈ విషయం గురించి మాట్లాడుకున్నారు. ‘మీటూ’ గురించి తొలుత హాలీవుడ్‌లో చర్చకు వచ్చింది. హాలీవుడ్‌లోని ప్రముఖ డైరెక్టర్లు, ఏజెంట్లు, మ్యూజిక్ డైరెక్టర్లు, నటులపై తొలుత లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయి. ఆ తర్వాత ఇది దేశం మొత్తం వ్యాపించింది. ఇవే ఆరోపణలపై కేంద్రమంత్రి ఒకరు తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది.
అక్టోబరు 1 నుంచి 30 మంది డేటాను విశ్లేషించగా ఈ విషయం బయటపడినట్టు ‘మెల్ట్‌వేర్’ వివరించింది. ‘మీటూ’పై అక్టోబరులో మొత్తంగా 28,900 ఎడిటోరియల్ న్యూస్ వచ్చింది. ఇందులో 95 శాతం అక్టోబరు 10 నుంచి 18 మధ్య రావడం గమనార్హం. ఆ సమయంలో భారత్‌లో ఈ ఉద్యమం తీవ్రస్థాయిలో నడుస్తోంది. బాలీవుడ్ నటుడు నానా పటేకర్‌పై నటి తనుశ్రీ దత్తా చేసిన లైంగిక ఆరోపణలతో దేశంలో ఉద్యమం ఊపందుకుంది.