ys jagan: పథకం ప్రకారమే జగన్ పై హత్యాయత్నం చేశారు: వైసీపీ నేత తమ్మినేని
- జగన్ కదలికలపై ఎనిమిది నెలలుగా నిఘా పెట్టారు
- పథకం ప్రకారమే శ్రీనివాసరావును ఉద్యోగంలో పెట్టారు
- నిందితుడికి మీడియాతో మాట్లాడే అవకాశమివ్వరే?
ఓ పథకం ప్రకారమే వైసీపీ అధినేత జగన్ పై హత్యాయత్నం జరిగిందని, ఎనిమిది నెలలుగా ఆయన కదలికలపై నిఘా పెట్టారని ఆ పార్టీ నేత తమ్మినేని సీతారాం అభిప్రాయపడ్డారు. ఈరోజు ఆయన మాట్లాడుతూ, ఈ పథకంలో భాగంగానే విశాఖ ఎయిర్ పోర్ట్ లోని రెస్టారెంట్ లో శ్రీనివాసరావును ఉద్యోగంలో పెట్టారని ఆరోపించారు. నిందితుడు శ్రీనివాసరావుకు మీడియాతో మాట్లాడే అవకాశం ఎందుకివ్వట్లేదు? ఈ కుట్రలో నటుడు శివాజీ కూడా భాగస్వామి అని, అతన్ని ఎందుకు విచారించడం లేదు? ఎయిర్ పోర్ట్ లో సీసీటీవీ ఫుటేజ్ ఎందుకు బయటపెట్టట్లేదు? అని ప్రశ్నించారు. గతంలో ఎన్టీఆర్ పై దాడికి పాల్పడ్డ మల్లెల బాబ్జీకి పట్టిన గతే ఇప్పుడు శ్రీనివాస్ కు కూడా పడుతుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయని అన్నారు. జగన్ పై దాడి కేసు విచారణ పక్కదోవ పడుతోందని, ఈ ఘటనపై విచారణ చేస్తున్న సిట్ పై తమకు నమ్మకం లేదని, థర్డ్ పార్టీతో విచారణ జరిపించేందుకు ఏపీ ప్రభుత్వం ఎందుకు భయపడుతోందని ప్రశ్నించారు. ‘ఆపరేషన్ గరుడ’ వెనకున్న రహస్యాలను బయటపెట్టాలని తమ్మినేని డిమాండ్ చేశారు.