Andhra Pradesh: తిత్లీ తుపాను బాధితులకు వైసీపీ అండ.. సహాయ సామాగ్రితో శ్రీకాకుళం బయలుదేరిన 10 లారీలు!
- రూ.కోటి విలువ చేసే సహాయ సామాగ్రి తరలింపు
- తిత్లీ బాధితులను ఏపీ ప్రభుత్వం సరిగ్గా ఆదుకోలేదన్న ధర్మాన
- త్వరలోనే జగన్ శ్రీకాకుళంలో పర్యటిస్తారని వెల్లడి
తిత్లీ తుపాను బాధితులను ఆదుకోవడానికి వైసీపీ తరఫున రూ.కోటి విలువైన సహాయక సామగ్రి పంపిస్తున్నట్లు వైసీపీ నేత ధర్మాన ప్రసాదరావు తెలిపారు. తుపాన్ బాధితులను ఆదుకోవడానికి 10 లారీలు హైదరాబాద్ నుంచి బయలుదేరాయని వెల్లడించారు. వైజాగ్ ఎయిర్ పోర్టులో శ్రీనివాసరావు అనే దుండగుడు జరిపిన కత్తి దాడిలో గాయపడ్డ జగన్ ప్రస్తుతం కోలుకుంటున్నారని పేర్కొన్నారు. ఈ రోజు వైసీపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
తిత్లీ తుపాను బాధితులను ఆదుకోవడంలో ఏపీ ప్రభుత్వం సరిగ్గా స్పందించలేదని ధర్మాన దుయ్యబట్టారు. పక్కనున్న ఒడిశా ఏపీతో పోల్చుకుంటే మెరుగైన ముందస్తు జాగ్రత్తలు, సహాయక చర్యలు చేపట్టిందన్నారు. గాయం నుంచి కోలుకున్నాక జగన్ శ్రీకాకుళం జిల్లాలో పర్యటిస్తారని వెల్లడించారు. వచ్చే నెల 3 నుంచి జగన్ ప్రజాసంకల్ప యాత్ర మొదలవుతుందని పేర్కొన్నారు.