Andhra Pradesh: ఉపాధి హామీ మహిళా ఉద్యోగులను వేధించిన అధికారి.. సస్పెండ్ చేసిన ఉన్నతాధికారులు!
- విశాఖపట్నంలోని చీడికాడలో ఘటన
- మహిళలను వేధించిన ఏపీవో శ్రీనివాసరావు
- క్షేతస్థాయిలో విచారణ జరిపిన అధికారులు
విశాఖపట్నంలో మహిళా ఉద్యోగులను వేధిస్తున్న ఏపీవో స్థాయి అధికారిపై వేటు పడింది. అతనిపై జరిగిన విచారణలో వేధింపులకు పాల్పడినట్లు రుజువు కావడంతో సస్పెన్షన్ వేటు వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ ఘటన జిల్లాలోని చీడికాడ మండలంలో చోటుచేసుకుంది.
జిల్లాలోని చీడికాడ మండల పరిధిలో శ్రీనివాసరావు అడిషనల్ ప్రోగ్రామ్ ఆఫీసర్(ఏపీఓ)గా పనిచేస్తున్నాడు. ఈ నేపథ్యంలో తమను శ్రీనివాసరావు వేధిస్తున్నాడనీ, అసభ్యకరంగా మాట్లాడుతున్నాడని మహిళా క్షేత్ర సహాయకులు ఎంపీడీఓ ఆర్.ఎం.గ్లాడ్స్, ఎంపీపీ కుచ్చు కళావతితో పాటు ఉపాధి హామీ పథకం ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు.
దీంతో ఈ ఘటనపై క్షేతస్థాయిలో విచారణ చేపట్టిన అధికారులు ఆరోపణలు నిజమేనని తేల్చారు. ఈ నేపథ్యంలో శ్రీనివాసరావును విధుల నుంచి తాత్కాలికంగా తప్పిస్తూ పీడీ డ్వామా ఉత్తర్వులు జారీచేశారు. ఈ బాధ్యతలను చోడవరం ఏపీవోకు అప్పగించారు.