Rahul Gandhi: మధ్యప్రదేశ్‌లో సీఎం అభ్యర్థిని ప్రకటించకపోవడంపై కారణం చెప్పిన రాహుల్ గాంధీ
- కమల్‌నాథ్ అనుభవజ్ఞుడు
- జ్యోతిరాదిత్య సింధియా యంగ్ అండ్ డైనమిక్
- రాష్ట్రానికి ఇద్దరూ అవసరమే
- ఎవరు ముఖ్యమంత్రి కావాలో ప్రజలే నిర్ణయిస్తారు
ఎన్నికలు దగ్గరపడుతున్నా మధ్యప్రదేశ్‌లో ఇంకా సీఎం అభ్యర్థిని ప్రకటించకపోవడంపై వస్తున్న విమర్శలపై కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ స్పందించారు. మంగళవారం ఇండోర్‌లో ఆయన జర్నలిస్టులతో మాట్లాడుతూ.. రాష్ట్రంలోని ఇద్దరు సీనియర్ నేతలు కమల్ నాథ్, జ్యోతిరాదిత్య సింధియా ఉన్నారన్నారు. ‘‘సీఎం అభ్యర్థిని ఎందుకు నిర్ణయించాలి. కమల్‌నాథ్‌కు కొన్ని విషయాల్లో సమర్థుడు. జ్యోతిరాదిత్యకు మరికొన్ని విషయాల్లో పట్టుంది. కమల్ నాథ్ అనుభవజ్ఞుడు. విషయ పరిజ్ఞానం ఉంది. సింధియా యంగ్ అండ్ డైనమిక్. నేను ఈ రెండింటినీ పరిగణనలోకి తీసుకుంటున్నా. అయితే, ముఖ్యమంత్రి ఎవరు కావాలన్న విషయాన్ని ప్రజలే నిర్ణయిస్తారు. నేనెందుకు వారి సామర్థ్యాన్ని వినియోగించుకోకూడదు’’ అని ప్రశ్నించారు.
ఎన్నికల్లో నేర చరిత్ర ఉన్న వారికి, క్రిమినల్ కేసులు ఉన్న నేతలకు టికెట్లు ఇవ్వడంపై అడిగిన ప్రశ్నకు రాహుల్ సమాధానం ఇస్తూ.. అవన్నీ రాజకీయ ప్రేరేపితాలని పేర్కొన్నారు. తామైతే మాత్రం నేరస్తులను ప్రోత్సహించబోమని స్పష్టం చేశారు.