New Delhi: పొల్యూషన్ ఎఫెక్ట్ : ఢిల్లీ నగరంలో ప్రైవేటు కార్లపై నిషేధం?
- నవంబరు 1 నుంచి అమలు చేసే యోచనలో కాలుష్య నియంత్రణ విభాగం
- నగరం చుట్టుపక్కల గోధుమ గడ్డి కాలుస్తుండడంతో పెరుగుతున్న ఇబ్బందులు
- ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 397గా నమోదు
దేశరాజధాని ఢిల్లీ మహానగరంలో తిరిగే ప్రైవేటు కార్లకు బ్రేక్ పడేలా ఉంది. రోజు రోజుకీ కాలుష్యం తీవ్రత పెరిగి పోతుండడంతో ప్రైవేటు కార్లను నిషేధించాలనే యోచనలో ఉన్నట్లు ఎన్విరాన్‌మెంట్ పొల్యూషన్ కంట్రోల్ అథారిటీ (ఈపీసీఏ) చైర్మన్ బూరేలాల్ మంగళవారం తెలిపారు. కాలుష్యం తీవ్రత మరింత పెరిగితే కార్లను నిషేధించి, ప్రజా రవాణా వ్యవస్థకే ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు ఆయన స్పష్టం చేశారు.
పొరుగు రాష్ట్రాల్లో గోధుమ గడ్డిని కాల్చడం, ప్రశాంతంగా గాలి వీస్తుండడంతో ఢిల్లీలో కాలుష్యం తీవ్రత ఎక్కువైందని సిస్టమ్ ఆఫ్ ఎయిర్ క్వాలిటీ ఫోర్‌కాస్టింగ్ అండ్ రీసెర్చి (సఫర్) తెలిపింది. మంగళవారం ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 397గా నమోదైందని, ఈ సీజన్లో ఇదే అత్యధికమని అధికారులు చెబుతున్నారు.
పొల్యూషన్ తీవ్రతను తెలియజేసే ఇండెక్స్ 400కు ఇంకా మూడు పాయింట్లే దూరం ఉన్నట్లు గుర్తించారు. నగరంలో 17 చోట్ల ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ తీవ్రంగా నమోదైందని అధికారులు తెలిపారు. పరిస్థితి ఇదే విధంగా కొనసాగితే ప్రైవేటు కార్లపై నిషేధం తప్పదని భావిస్తున్నారు.