Germany: అవును.. బోరుకొట్టడం వల్లే వందమందిని చంపేశా: కోర్టులో నిర్భయంగా అంగీకరించిన మాజీ నర్స్!
- తనపై మోపిన అభియోగాలు నిజమేనన్న హోగెల్
- 2000-2005 మధ్య వందమందిని హత్య చేసిన వైనం
- 200 మందిని హత్య చేసి ఉండొచ్చన్న పోలీసులు
జీవితంపై బోరు కొట్టడం వల్లే వందమందిని చంపేశానని జర్మనీకి చెందిన మాజీ నర్స్ నీల్స్ హోగెల్ అంగీకరించాడు. తన పర్యవేక్షణలో ఉన్న వందమందినీ చంపేసినట్టు మంగళవారం కోర్టులో అంగీకరించాడు. యుద్ధానంతరం జర్మనీలో జరిగిన అతిపెద్ద సీరియల్ కిల్లింగ్గా చెప్పుకుంటున్న ఈ కేసులో జీవితకాల శిక్ష అనుభవిస్తున్న హోగెల్ (41) ఇప్పటికే దశాబ్దానికిపైగా జైలు శిక్ష అనుభవించాడు. మందులు ఓవర్ డోస్ ఇవ్వడం ద్వారా తన పర్యవేక్షణలో ఉన్న వారిని చంపేసినట్టు పేర్కొన్నాడు.
ఈ కేసులో మంగళవారం తాజాగా విచారణ ప్రారంభమైంది. ఓల్డెన్బర్గ్ ప్రిసైడింగ్ జడ్జి సెబాస్టియన్ బ్యూహెర్మన్ మాట్లాడుతూ.. ‘‘నీకు వ్యతిరేకంగా నమోదైన అభియోగాలు నిజమేనా?’’ అని హోగెల్ను ప్రశ్నించారు. దీనికి హోగెల్ సమాధానమిస్తూ ‘‘అవును’’ అని పేర్కొన్నాడు. ‘‘నాపై మోపిన అభియోగాలు నిజమే’’ అంటూ అతడి బంధువులు, బాధిత కుటుంబ సభ్యులతో నిండిపోయిన కోర్టులో ఏమాత్రం పశ్చాత్తాపం లేకుండా గంభీరంగా పేర్కొన్నాడు.
2000-2005 మధ్య ఓల్డెన్బర్గ్, డెల్మెన్హార్స్లలోని ఆసుపత్రులలో పనిచేసిన హోగెల్ వందమంది రోగులను హత్య చేశాడు. ఓల్డెన్బర్గ్ ఆసుపత్రిలో 36 మందిని, డెల్మెన్హార్స్ ఆసుపత్రిలో 64 మందిని అతడు హత్య చేసినట్టు ప్రాసిక్యూషన్ పేర్కొంది. 2005లో ఓ రోగికి అనుమానాస్పద స్థితిలో ఇంజెక్షన్ చేస్తూ పట్టుబడిన హోగెల్కు న్యాయస్థానం ఎనిమిదేళ్ల శిక్ష విధించింది.
2014-15లో మరోమారు కేసు విచారణకు రాగా, దోషిగా తేలడంతో 15 ఏళ్ల జైలు శిక్ష పడింది. దీంతో విచారణ చేపట్టిన అధికారులు నివ్వెరపోయారు. అతడి పర్యవేక్షణలో మరణించిన 130 మృతదేహాలను వెలికి తీశారు. ఈ కేసు వెలుగులోకి వచ్చిన తర్వాత ప్రపంచం ఒక్కసారిగా నివ్వెరపోయింది. అయితే, అతడి చేతిలో మరణించిన వారి సంఖ్య 200కుపైగానే ఉండే అవకాశం ఉందని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.