accidennt: స్కూల్ బస్సు బోల్తా : ఎక్కువమంది విద్యార్థులు లేకపోవడంతో తప్పిన ప్రమాదం
- మలుపు తిరుగుతుండగా ఢీకొట్టిన రెడీమిక్స్ లారీ
- ఓ విద్యార్థికి, క్లీనర్‌కు స్వల్పగాయాలు
- నిబంధనలు ఉల్లంఘించి లారీ డ్రైవర్ ప్రవేశం
పాఠశాల బస్సుకు తృటిలో ఘోర ప్రమాదం తప్పింది. రెడీ మిక్స్ వాహనం ఢీకొట్టిన ఘటనలో బస్సు బోల్తాపడింది. ఆ సమయానికి బస్సులో సిబ్బందితోపాటు ఒకరిద్దరు విద్యార్థులే ఉండడంతో పెను ప్రమాదం తప్పింది. ఘటనలో ఓ విద్యార్థి, బస్సు క్లీనర్ స్వల్పంగా గాయపడ్డారు.
వన్మోర్ నగర్ చౌరస్తాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి ట్రాఫిక్ పోలీసులు అందించిన వివరాలు ఇవీ. మాదాపూర్ గ్లోబల్ పాఠశాలకు చెందిన బస్సు మంగళవారం సాయంత్రం ఆరు గంటల సమయంలో మణికొండలో ఓ విద్యార్థిని దించి వస్తోంది. వన్‌మోర్‌నగర్ చౌరస్తా వద్ద బస్సు మలుపు తిరుగుతుండగా నార్సింగ్ వైపు నుంచి అతివేగంగా వస్తున్న రెడీమిక్స్ లారీ ఢీకొట్టింది. దీంతో బస్సు బోల్తాపడింది.
ఘటనలో కోకాపేటకు చెందిన టెన్త్ విద్యార్థి, క్లీనర్ గాయపడ్డారు. లారీ వేగంగా వచ్చి ఢీకొట్టడం వల్లే ప్రమాదం జరిగినట్లు బస్సు డ్రైవర్ ఆంజనేయులు తెలిపారు. కాగా, భారీ వాహనాలకు ఉదయం 8 నుంచి రాత్రి 10 గంటల వరకు నగరంలోకి అనుమతి లేదు. కానీ రెడీమిక్స్ లారీ డ్రైవర్ నిబంధనలు ఉల్లంఘించి ప్రవేశించినట్లు గుర్తించారు. లారీ యజమానిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.