ys jagan: జగన్ పై దాడి కేసు.. నిందితుడు విచారణకు సహకరించట్లేదు: విశాఖ సీపీ లడ్డా
- శ్రీనివాస్ కొన్ని విషయాలను దాచిపెడుతున్నాడు
- ఇప్పటి వరకు 35 మంది సాక్షులను ప్రశ్నించాం
- ముగ్గురు మాత్రమే దర్యాప్తునకు సహకరించారు
జగన్ పై దాడి కేసులో నిందితుడు పూర్తి స్థాయిలో విచారణకు తమకు సహకరించడం లేదని విశాఖపట్టణం సీపీ లడ్డా తెలిపారు. విశాఖలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, రెగ్యులర్ చెకప్ లో భాగంగానే అతన్ని ఆసుపత్రికి తీసుకెళ్లామని, అతని ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు చెప్పారని అన్నారు. శ్రీనివాస్ కొన్ని విషయాలను దాచిపెడుతున్నాడని, వేర్వేరు కోణాల్లో ఈ కేసును దర్యాప్తు చేస్తున్నామని, ఒడిశాకు కూడా ఒక దర్యాప్తు బృందాన్ని పంపామని అన్నారు. ఇప్పటి వరకు 35 మంది సాక్షులను ప్రశ్నించామని, ఇంతవరకూ ముగ్గురు మాత్రమే దర్యాప్తునకు సహకరించారని అన్నారు. శ్రీనివాస్ ఉపయోగించిన కత్తితో పాటు సెల్ ఫోన్లను ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపామని చెప్పారు.
ఎస్బీఐ, విజయబ్యాంక్, ఆంధ్రా బ్యాంక్ లలో శ్రీనివాస్ కు అకౌంట్లు ఉన్నాయని, తనతో పనిచేసే వ్యక్తి సెల్ ఫోన్ ను శ్రీనివాస్ వినియోగించాడని చెప్పారు. అతని ఖాతాలో ఒకసారి నలభైవేలు, మరోసారి ఇరవై వేల రూపాయలు జమయ్యాయని, డబ్బుు జమైన కాసేపటికే మరొకరి ఖాతాకు బదిలీ అయినట్టు తమ విచారణలో తెలిసిందని చెప్పారు. డబ్బులు ఎందుకు డిపాజిట్ చేశారో, ఆ డబ్బును ఎవరికి బదిలీ చేశారన్న విషయాలు తేలాల్సి ఉందని లడ్డా పేర్కొన్నారు.
జగన్ పై దాడి జరిగినప్పుడు క్రికెటర్ల భద్రతా ఏర్పాట్లలో సీఐఎస్ఎఫ్ అధికారులు బిజీగా ఉన్నారని, తనను చంపి రాజకీయం చేసేందుకు చూస్తున్నారని నిందితుడు శ్రీనివాస్ వ్యాఖ్యలు చేయడంలో అర్థం లేదని, తాము తమ డ్యూటీ చేస్తున్నామని లడ్డా స్పష్టం చేశారు.