Chandrababu: 40 ఏళ్ల అనుభవం ఉన్న చంద్రబాబుకు నిన్ను మర్డర్ చేయాల్సిన అవసరం లేదు: జగన్ పై సోమిరెడ్డి ఫైర్
- దేశంలో ఎంతో గుర్తింపు ఉన్న చంద్రబాబుకు నిన్ను హత్య చేయాల్సిన అవసరం లేదు
- జగన్ కు 10 పేజీల లవ్ లెటర్ రాసి, చిన్న కత్తితో దాడి చేశాడు
- దాడి కేసులో చంద్రబాబు ఏ1 అంటూ కథనాలు రాశారు
పట్టిసీమ నుంచి రాయలసీమకు నీరు ఎలా వస్తుందని ప్రతిపక్ష నేత జగన్ ఎప్పుడూ ప్రశ్నిస్తుంటారని... పట్టిసీమ నీటిని కృష్ణా డెల్టాకు ఇవ్వడం ద్వారా అక్కడ పొదుపు చేసుకున్న నీటి శాతాన్ని... శ్రీశైలం నుంచి రాయలసీమకు తరలిస్తున్నామని మంత్రి సోమిరెడ్డి అన్నారు. ఈ విషయం ఎన్ని సార్లు చెప్పినా జగన్ కు అర్థం కావడం లేదని, మళ్లీమళ్లీ ప్రశ్నిస్తూనే ఉంటారని విమర్శించారు. చివరకు కడప జిల్లాలోని చిత్రావతిలో కూడా నీరు నింపిన గొప్ప నాయకుడు చంద్రబాబు అని చెప్పారు. చంద్రబాబు సీఎం అయ్యాక పెన్షన్లను రూ. 1000కి పెంచారని, 24 గంటలు కరెంట్ ఇస్తున్నారని తెలిపారు. ప్రొద్దుటూరులో జరిగిన ధర్మపోరాట దీక్ష సభలో మాట్లాడుతూ, ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
తెలుగు ప్రజలపై ప్రధాని మోదీ కక్షపెట్టుకున్నారని సోమిరెడ్డి మండిపడ్డారు. రాష్ట్రంలోని విపక్షాలు మోదీకి మద్దతుగా ఉన్నాయని విమర్శించారు. విశాఖ విమానాశ్రయంలో వైసీపీ అభిమాని అయిన ఓ పిల్లవాడు జగన్ కు 10 పేజీల లవ్ లెటర్ రాసి... చేతిలో చిన్న కత్తి పెట్టుకుని దాడి చేశాడని అన్నారు. విశాఖలో హాయ్, బాయ్ అని చెప్పి... హైదరాబాదుకు పోయి పడుకున్నారని విమర్శించారు. దాడి కేసులో చంద్రబాబు ఏ1 అంటూ సాక్షిలో కథనాలు రాశారని దుయ్యబట్టారు. జగన్ ను చంపేందుకు ముఖ్యమంత్రి కుట్ర చేశారని ఆరోపించడం నీచమని అన్నారు. 40 ఏళ్ల అనుభవం ఉన్న చంద్రబాబుకు నిన్ను మర్డర్ చేసి, రాజకీయం చేయాల్సిన అవసరం వచ్చిందా? అని ప్రశ్నించారు. దేశంలోనే ఎంతో గుర్తింపు ఉన్న చంద్రబాబుకు నిన్ను హత్య చేయాల్సిన అవసరం లేదని అన్నారు.
గతంలో సెక్రటేరియట్ లో వైయస్ వెనుక ఓ వ్యక్తి కత్తి పట్టుకుని వెళ్లారని, దాడి నుంచి ఆయన తప్పించుకున్నారని సోమిరెడ్డి తెలిపారు. ఈ దాడి యత్నానికి చంద్రబాబు కారణమని వైయస్ చెప్పలేదని అన్నారు. అలిపిరిలో దాడికి వైయస్ కారణమని చంద్రబాబు ఆరోపించలేదని చెప్పారు. ఇప్పుడు మీ అభిమానే చిన్న కత్తితో దాడి చేస్తే... దానికి కారణం చంద్రబాబు అని అనడం నీచమని అన్నారు.