Chandrababu: రాయలసీమలో కడప స్టీల్ ప్లాంట్ ను ఏర్పాటు చేస్తాం..త్వరలోనే శంకుస్థాపన చేస్తాం: సీఎం చంద్రబాబు
- కేంద్రం ముందుకు రాకపోతే మాకు అప్పజెప్పాలి
- ఉక్కు కర్మాగారం ఏర్పాటుకు క్లియరెన్స్ ఇస్తున్నా
- మేము కూడా ఈ దేశ పౌరులమే..చిన్నచూపొద్దు
రాయలసీమలో కడప స్టీల్ ప్లాంట్ ను ఏర్పాటు చేస్తామని, తొందరలోనే శంకుస్థాపన చేస్తామని ఏపీ సీఎం చంద్రబాబునాయడు పేర్కొన్నారు. కడప జిల్లా ప్రొద్దుటూరులో జరుగుతున్న ధర్మపోరాట సభలో ఆయన మాట్లాడుతూ, కడపలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు ముందుకొస్తారా? లేదా? న్యాయానికి కట్టుబడి ఉన్నారా? లేదా? బాధ్యత తీసుకుంటారా? లేదా? అని కేంద్రాన్ని మళ్లీ అడుగుతున్నానని అన్నారు.
కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేస్తే రాష్ట్రం తరపున అన్ని రకాల రాయితీలు ఇస్తామని అన్నారు. కేంద్రం ముందుకు రాకపోతే ఆ బాధ్యతను తమకు అప్పజెప్పాలని, త్వరలో కేబినెట్ సమావేశం జరగనుందని, రాయలసీమ ఉక్కు కర్మాగారం ఏర్పాటుకు క్లియరెన్స్ ఇస్తున్నానని మరొక్కసారి ప్రజలకు హామీ ఇస్తున్నానని చంద్రబాబు పేర్కొన్నారు.
కడపలో జిల్లాలో ఉక్కుఫ్యాక్టరీ రావాలని, ఇది ప్రజల హక్కు అని అన్నారు. కడప జిల్లాకు ఉక్కు ఫ్యాక్టరీ ఇవ్వకపోతే ఏవిధంగా తెప్పించుకోవాలో ఆవిధంగా తెప్పించుకుంటామని, తాము కూడా ఈ దేశంలో పౌరులమేనని, చిన్నచూపు చూడటం తగదని కేంద్రానికి హితవు పలికారు. ఇంకో నెలలోపులోనే ఉక్కు ఫ్యాక్టరీ కి శంకుస్థాపన చేస్తామన్నారు.
వారం రోజులు శ్రీకాకుళంలోనే ఉండి బాధితులను ఆదుకున్నా
శ్రీకాకుళంలో ఇటీవల సంభవించిన తిత్లీ తుఫాన్ బాధితులను ఆదుకునేందుకు వారంరోజులు అక్కడే ఉన్నానని చంద్రబాబు అన్నారు. ఇటీవల గుంటూరు వరకు వచ్చిన కేంద్ర మంత్రి తిత్లీ తుపాన్ ఘటనపై స్పందించలేదని, జగన్, పవన్ కల్యాణ్ లు కూడా తుపాన్ బాధితులను పరామర్శించలేదని విమర్శించారు.