jagan: ధర్మపోరాట దీక్ష సభలో జగన్, పవన్ లపై విరుచుకుపడ్డ నారా లోకేష్!
- బీజేపీ అంటే భారతీయ జనతా పార్టీ, జగన్ పార్టీ, పవన్ పార్టీ
- మూడు గంటలు బాగానే ఉన్న జగన్.. ఆసుపత్రిలో చేరాక డ్రామాకు తెర లేపారు
- తిత్లీ తుపాను బాధితులను పరామర్శించేందుకు పవన్ 6 రోజుల తర్వాత వెళ్లారు
2014లో రూ. 16 వేల కోట్ల లోటు బడ్జెట్ తో, కట్టు బట్టలతో ఏపీ ప్రజలను పంపించేశారని ఏపీ మంత్రి నారా లోకేష్ అన్నారు. బీజేపీతో పొత్తు పెట్టుకుంటే రాష్ట్రానికి మంచి జరుగుతుందనే ఉద్దేశంతోనే వారితో కలిశామని చెప్పారు. కానీ, బీజేపీ మోసం చేసిందని మండిపడ్డారు. బీజేపీ మోసం చేసినా... ఏపీని ముఖ్యమంత్రి చంద్రబాబు అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లారని చెప్పారు. రూ. 5కి బిస్కెట్ ప్యాకెట్ కూడా రాదని... మన రాష్ట్రంలో అన్నా క్యాంటీన్ల ద్వారా రూ.5కి పేదల కడుపు నింపుతున్నామని తెలిపారు. కడప జిల్లా ప్రొద్దుటూరులో నిర్వహించిన ధర్మపోరాట దీక్షలో మాట్లాడుతూ, ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
కడప ఉక్కు ఫ్యాక్టరీ కోసం సీఎం రమేష్ దీక్ష చేపడితే... ఆయనపై ఐటీ దాడులు చేయించారని లోకేష్ మండిపడ్డారు. బీజేపీకి జగన్ పుత్రుడైతే, పవన్ కల్యాణ్ దత్త పుత్రుడని ఎద్దేవా చేశారు. రాష్ట్రానికి అన్యాయం చేస్తున్న ప్రధాని మోదీపై వీరిద్దరూ ఒక్క విమర్శ కూడా చేయలేదని అన్నారు. బీజేపీ అంటే భారతీయ జనతా పార్టీ, జగన్ పార్టీ, పవన్ కల్యాణ్ పార్టీ అని చెప్పారు. జగన్ పార్టీ ఒక డ్రామా కంపెనీ అని ఎద్దేవా చేశారు. వైసీపీ ఎంపీలు చేసిన రాజీనామాలు, వైజాగ్ లో జరిగిన కోడికత్తి దాడి ఇవన్నీ డ్రామాలే అని అన్నారు.
విశాఖ విమానాశ్రయంలో నవ్వుకుంటూ వెళ్లిన జగన్... హైదరాబాదు ఎయిర్ పోర్టులో నవ్వుకుంటూ, చేతులు ఊపుతూ వెళ్లారని లోకేష్ చెప్పారు. మూడు గంటల సేపు బాగానే ఉన్న జగన్... ఆసుపత్రిలో దుప్పటి కప్పుకుని, ఫొటోలు బయటకు పంపి, డ్రామాకు తెరతీశారని అన్నారు. ఏపీ పోలీసులతో మాట్లాడనని, తెలంగాణ అధికారులకైతే సమాధానాలు చెబుతానని హాస్యాస్పదంగా వ్యవహరించారని చెప్పారు. ఆయన పేరు జగన్మోహన్ రెడ్డి కాదని జగన్ మోదీ రెడ్డి అని ఎద్దేవా చేశారు.
జగన్ కు కోర్టుకు వెళ్లడానికి, ఇంటికి వెళ్లడానికి, పాదయాత్రకు సమయం ఉంటుందని.. అరకు ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేలను మావోయిస్టులు హత్య చేస్తే... వారి కుటుంబసభ్యులను పరామర్శించేందుకు మాత్రం సమయం ఉండదని లోకేష్ విమర్శించారు. కవాతులు చేస్తున్న పవన్ కల్యాణ్... తిత్లీ తుపాను బాధితులను పరామర్శించేందుకు ఆరు రోజుల తర్వాత వెళ్లారని మండిపడ్డారు. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పవర్ ఫుల్ గా కేంద్రాన్ని నిలదీస్తారనుకుంటే... చివరకు సైలెంట్ గా ఉండిపోయారని విమర్శించారు.
అమరావతికి రూ. 1500 కోట్లు ఇచ్చి, పటేల్ విగ్రహానికి ఏకంగా రూ. 3 వేల కోట్లు ఇచ్చారని లోకేష్ విమర్శించారు. పని విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు స్పీడును అందుకోవడం ఎవరి వల్ల కావడం లేదని అన్నారు. ఏపీ భవిష్యత్తు బాగుండాలంటే చంద్రబాబు మరోసారి ముఖ్యమంత్రి కావాలని అన్నారు. కర్ణాటక ఎన్నికలు బీజేపీకి ఒక ట్రయల్ మాత్రమేనని... అసలు సినిమా ముందుందని చెప్పారు. కులం, మతం, ప్రాంతం వారీగా చిచ్చు పెట్టేందుకు విపక్షాలు కుట్రలు పన్నుతున్నాయని... ఆంధ్రులంతా ఒకటే అని నిరూపిస్తూ, టీడీపీకి ఘన విజయాన్ని కట్టబెట్టాలని కోరారు.