chattisgargh: ఛత్తీస్ గఢ్ లో రెచ్చిపోయిన మావోలు.. దూర్ దర్శన్ కెమెరామెన్ సహా ముగ్గురి కాల్చివేత!
- దంతెవాడ జిల్లాలో వాహనంపై దాడి
- ఎన్నికలు బహిష్కరించాలని ఇప్పటికే హెచ్చరిక
- కూంబింగ్ ప్రారంభించిన అధికారులు
నవంబర్ 12న ఎన్నికలు జరగనున్న ఛత్తీస్ గఢ్ లో మావోయిస్టులు రెచ్చిపోయారు. దంతెవాడ జిల్లాలోని అర్నాపూర్ ప్రాంతంలో వెళుతున్న వాహనంపై మావోయిస్టులు దాడిచేశారు. ఈ ఘటనలో దూర్ దర్శన్ కెమెరామెన్ తో పాటు ఇద్దరు పోలీస్ అధికారులు ప్రాణాలు కోల్పోయారు. హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్న భద్రతా బలగాలు మావోయిస్టుల కోసం కూంబింగ్ ను ప్రారంభించాయి.
ఛత్తీస్ గఢ్ అసెంబ్లీకి నవంబర్ 12, 20న రెండు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికలను బహిష్కరించాలని మావోయిస్టులు ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ క్రమంలోనే మూడ్రోజుల క్రితం బీజాపూర్ జిల్లాలో సీఆర్పీఎఫ్ జవాన్ల ల్యాండ్ మైన్ ప్రూఫ్ వాహనాన్ని మందుపాతరతో పేల్చేశారు. ఈ ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే చనిపోగా, మరో జవాన్ తీవ్రంగా గాయపడ్డాడు.
ఈ ఘటన నుంచి భద్రతాబలగాలు తేరుకోకముందే మరోసారి మావోలు దాడికి దిగారు. మావోయిస్టుల దాడిలో దూర్ దర్శన్ టీవీ ఛానల్ కెమెరామెన్ తో పాటు ఓ ఎస్సై, మరో పోలీస్ అధికారి ప్రాణాలు కోల్పోయారు. ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే ఘటనాస్థలి చేరుకున్న భద్రతాబలగాలు సహాయక చర్యలు చేపట్టాయి. ఈ సందర్భంగా మావోయిస్టులను ఏరివేయడానికి బలగాలు భారీ స్థాయిలో కూంబింగ్ ఆపరేషన్ ను ముమ్మరం చేశాయి.