Andhra Pradesh: జగన్ నొప్పితో బాధపడుతున్నారు.. గాయం పూర్తిగా మానడానికి మరో 45 రోజులు పడుతుంది!: సిటీ న్యూరో డాక్టర్లు
- పెయిన్ కిల్లర్స్, యాంటీ బయోటిక్స్ ఇస్తున్నాం
- పాదయాత్రకు వెళతాననే జగన్ చెప్పారు
- చేతిని కదిలించకూడదని సూచించాం
ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత జగన్ ఆరోగ్యం ప్రస్తుతం స్థిరంగా ఉందని సిటీ న్యూరో ఆసుపత్రి వైద్యులు తెలిపారు. జగన్ ను పొడిచిన కత్తికి ఎలాంటి విషం లేదని వెల్లడించారు. ప్రస్తుతం గాయం నుంచి జగన్ కోలుకుంటున్నారని చెప్పారు. చేతిని కదిలించేటప్పుడు జగన్ నొప్పితో బాధపడుతున్నారని పేర్కొన్నారు. ఈ రోజు లోటస్ పాండ్ లోని జగన్ నివాసంలో ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం డాక్టర్ జ్ఞానేశ్వర్, డాక్టర్ సాంబశివారెడ్డి, డాక్టర్ చంద్రశేఖర్, డాక్టర్ మధు మీడియాతో మాట్లాడారు.
నొప్పి ఇంకా తగ్గకపోవడంతో జగన్ కు యాంటీ బయోటిక్స్, పెయిన్ కిల్లర్స్ ఇస్తున్నట్లు డాక్టర్ జ్ఞానేశ్వర్ తెలిపారు. త్వరలోనే మళ్లీ ఆయన ప్రజాసంకల్ప యాత్రలో పాల్గొననున్న నేపథ్యంలో చేతికి ఎక్కువ శ్రమ కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించామన్నారు.
చర్మంపై వేసిన కుట్లు సాధారణంగా వారంలోనే మానిపోతాయనీ, అయితే కండరాలకు వేసిన కుట్లు మానడానికి మరికొంత సమయం పడుతున్నారు. జగన్ విషయంలో గాయం పూర్తిగా మానడానికి మరో 45 రోజులు పట్టే అవకాశముందని స్పష్టం చేశారు. పాదయాత్రకు వెళతానన్న కోణంలోనే జగన్ మాట్లాడారని తెలిపారు. వచ్చే శనివారం నుంచి జగన్ ప్రజాసంకల్ప యాత్రలో పాల్గొననున్న సంగతి తెలిసిందే.