Jagan: జగన్ పై హత్యాయత్నం వెనుక కుట్ర దాగుంది!: వైసీపీ నేత విజయసాయిరెడ్డి
- డీజీపీ నిందితుడి పేరు, కులం బయటపెట్టారు
- సంఘీభావం తెలిపిన పార్టీలపై చంద్రబాబు మండిపడ్డారు
- ముఖ్యమంత్రి ప్రవర్తన దారుణంగా ఉంది
ప్రాణాలు తీసేందుకు తనపై దాడిచేసిన శ్రీనివాసరావుపై దాడి చేయవద్దని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ సూచించారని వైసీపీ సీనియర్ నేత విజయ సాయిరెడ్డి తెలిపారు. నిందితుడిని పోలీసులకు అప్పగించాలని తమ అధినేత చెప్పారన్నారు. విశాఖపట్నం విమానాశ్రయంలో ప్రథమ చికిత్స తీసుకున్నాక జగన్ హైదరాబాద్ కు వెళ్లారనీ, అక్కడ న్యూరో సిటీ ఆసుపత్రిలో చేరారని వెల్లడించారు. ఈరోజు ఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో వైసీపీ నేతలతో కలిసి విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడారు.
జగన్ పై మధ్యాహ్నం 12.35 గంటల సమయంలో జగన్ పై దాడి జరిగితే, 2 గంటలకు జగన్ పై దాడి చేసింది ఆయన అభిమానేనని రాష్ట్ర డీజీపీ ఆర్పీ ఠాకూర్ ప్రకటన విడుదల చేశారని సాయిరెడ్డి తెలిపారు. సాధారణంగా నిందితుడి పేరు, ఇతర వివరాలను బయటపెట్టరనీ, కానీ ఈ ఘటనలో మాత్రం డీజీపీ నిందితుడి పేరుతో పాటు కులం వివరాలను కూడా బయటపెట్టారని వెల్లడించారు. ఇది నిబంధనలను పూర్తిగా ఉల్లంఘించడమేనని స్పష్టం చేశారు. ఈ వ్యవహారాలన్నీ చూస్తుంటే జగన్ పై హత్యాయత్నం వెనుక పెద్ద కుట్ర దాగుందని విజయ సాయిరెడ్డి అనుమానం వ్యక్తం చేశారు.
ఈ ఘటనలన్నీ చూస్తుంటే కొందరు వ్యక్తులు కావాలనే జగన్ పై హత్యాయత్నం చేయించినట్లు అనుమానం కలుగుతోందని వ్యాఖ్యానించారు. నిందితుడు శ్రీనివాసరావు వైసీపీ కార్యకర్త అని చూపేలా టీడీపీ కార్యాలయం మీడియా సంస్థలకు నకిలీ ప్లెక్సీలను విడుదల చేసిందన్నారు.
జగన్ పై దాడిని ఖండించిన జనసేన, టీఆర్ఎస్, బీజేపీ నేతలపై టీడీపీ నేతలు సిగ్గులేకుండా విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. 2003లో చంద్రబాబుపై అలిపిరి దాడి ఘటనను తెలుసుకున్న వెంటనే అప్పటి ప్రతిపక్ష నేత రాజశేఖరరెడ్డి తిరుపతికి వెళ్లి ధర్నాకు దిగారని గుర్తుచేశారు. ఇక్కడ జగన్ పై దాడి జరిగాక, చంద్రబాబు ప్రవర్తించిన తీరు దారుణంగా ఉందని మండిపడ్డారు.