Jagan: జగన్ ను ఎయిర్ పోర్టులోనే అడ్డుకోవాల్సింది.. ఆయనకు ఏపీలో పోటీ చేసే అర్హత లేదు!: మంత్రి నక్కా
- పక్కా ప్లాన్ తోనే దాడి చేయించుకున్నారు
- అందుకే జగన్ నవ్వుతూ వెళ్లిపోయారు
- ఏపీలో వ్యవస్థలపై నమ్మకం లేదని చెప్పడం దారుణం
కత్తి దాడి జరగ్గానే ఎవరైనా భయపడతారనీ, కానీ జగన్ మాత్రం నవ్వుతూ, చేతులు ఊపుతూ విమానం ఎక్కి వెళ్లిపోయారని మంత్రి నక్కా ఆనందబాబు తెలిపారు. తాము చేయించుకున్న దాడి కాబట్టే జగన్ భయపడకుండా వెళ్లారన్నారు. కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం(సీఐఎస్ఎఫ్) రక్షణ ఉన్న ప్రాంతంలో దాడి జరిగాక జగన్ ను అక్కడి నుంచి వెళ్లకుండా అడ్డుకోవాల్సిందని వ్యాఖ్యానించారు. ఈరోజు విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
స్థానిక పోలీసులకు ఫిర్యాదు ఇచ్చాక జగన్ వెళ్లి ఉండాల్సిందనీ, ఇక్కడ ఆసుపత్రిలో చికిత్స తీసుకుని ఉండాల్సిందని తెలిపారు. కత్తి పొడవు 3 సెంటీమీటర్లు అయితే మూడున్నర సెంటీమీటర్ల లోతు, మూడు సెంటీమీటర్ల వెడల్పు గాయం అవడం ఏంటని ప్రశ్నించారు. అమరావతి నుంచి విచారణ కోసం పోలీసులు వెళితే ఏపీ పోలీసులపై నమ్మకం లేదని చెప్పడాన్ని రాష్ట్ర ప్రజలు గమనిస్తూ ఉన్నారని వ్యాఖ్యానించారు. ఏపీలో ప్రతిపక్ష నేతగా ఉంటూ, ఏడాదిగా పాదయాత్ర చేస్తున్న జగన్ కు రాష్ట్ర పోలీసులే రక్షణ కల్పించారని గుర్తుచేశారు.
థర్డ్ పార్టీ విచారణ జరపాలని వైసీపీ నేతలు కోరడంపై ‘థర్డ్ పార్టీ విచారణ అంటే ఎవరితో? తెలంగాణ పోలీసులతో విచారణ జరపమంటారా? తమిళనాడు పోలీసులతో విచారణ జరపమంటారా? వైసీపీ నేత ఒకరు కేంద్ర సంస్థలను విచారణకు ఆదేశించాలని హైకోర్టు ఆశ్రయించారు. కేంద్ర సంస్థ అంటే ఏమిటి? సీబీఐనే కదా?
మరి సీబీఐ విచారణే కావాలని డైరెక్టుగా అడగొచ్చు కదా’ అని వ్యాఖ్యానించారు. సీబీఐపై కూడా తనకు నమ్మకం లేదనీ, అది కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అని జగన్ గతంలోనే తేల్చేశారని వెల్లడించారు. రాష్ట్రంలో ఉన్న వ్యవస్థలు, అధికార యంత్రాంగాలపై నమ్మకం లేని జగన్ కు రాష్ట్రంలో పోటీ చేసే అర్హతే లేదని నక్కా ఆనందబాబు పేర్కొన్నారు.