Hyderabad: సర్వీస్ సెంటర్‌లో పోయిన బైక్.. వాహనదారుడికి రూ. 2.94 లక్షలు చెల్లించమన్న వినియోగదారుల ఫోరం
- సర్వీసింగ్‌కు ఇస్తే చోరీకి గురైన బైక్
- పూర్తిగా పాడైన బైక్‌ను తీసుకునేందుకు అంగీకరించని వినియోగదారుడు
- వినియోగదారుల ఫోరంలో విజయం
సర్వీసింగ్ కోసం ఇచ్చిన బైక్ పోయిన ఘటనలో వాహనదారుడికి రూ.2.19 లక్షలు చెల్లించాల్సిందిగా హైదరాబాద్‌లోని సర్వీస్ సెంటర్‌ను వినియోగదారుల ఫోరం ఆదేశించింది. నగరానికి చెందిన మధుసూదన్ అనే వ్యక్తి రూ.2.19 లక్షల విలువైన బైక్‌ను వినాయక మోబైక్స్ ప్రైవేట్ లిమిటెడ్‌లో కొనుగోలు చేశాడు. 9 ఫిబ్రవరి 2016లో సర్వీసింగ్ కోసం బైక్‌ను సర్వీస్ సెంటర్‌లో అప్పగించాడు. నాలుగు రోజుల తర్వాత బైక్ చోరీకి గురైందంటూ సర్వీస్ సెంటర్ నుంచి సమాచారం అందింది. దీంతో అతడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
సర్వీస్ సెంటర్‌లోనే తన బైక్ చోరీకి గురైనందున తనకు కొత్త బైక్ కానీ, లేదంటే వందశాతం క్యాష్ బ్యాక్ కానీ ఇవ్వాలని కోరాడు. అయితే, బైక్ దొరికిన తర్వాత బాగు చేసి ఇస్తామని తెలిపారు. బీమా వచ్చాక పరిహారం సెటిల్ చేస్తామని హామీ ఇచ్చారు. 20 మే 2016న బైక్ దొరకడంతో పోలీసులు దానిని వినాయక మోబైక్స్‌కు అందించారు. దానికి మరమ్మతులు చేసిన వారు రాజును పిలిచి టెస్ట్ డ్రైవ్ చేయమన్నారు.
అయితే, అది పూర్తిగా పాడైనట్టు గమనించిన రాజు తనకా బైక్ అవసరం లేదని, పరిహారం ఇవ్వాల్సిందిగా ఫిర్యాదు చేశాడు. అందుకు డీలర్ నిరాకరించడంతో మధు వినియోగదారుల ఫోరాన్ని ఆశ్రయించాడు. కేసును విచారించిన ఫోరం తాజాగా తీర్పు చెబుతూ వినియోగదారుడికి బైక్ విలువ మొత్తం రూ.2.19 లక్షలతోపాటు పరిహారం కింద రూ.75 వేలు చెల్లించాల్సిందిగా ఆదేశించింది.