New Delhi: ఢిల్లీలోని ఐఏఎస్ అకాడమీలో తమిళనాడు యువతి ఆత్మహత్య.. అర్ధరాత్రి ఉరేసుకున్న వైనం

  • సివిల్స్ పరీక్షల శిక్షణ కోసం ఢిల్లీలో వున్న యువతి 
  • మానసిక సమస్యలతో బాధపడుతున్నట్టు గుర్తించిన పోలీసులు
  • కన్నీరుమున్నీరవుతున్న తల్లిదండ్రులు

ఢిల్లీలో ఉంటూ సివిల్స్ పరీక్షలకు శిక్షణ పొందుతున్న తమిళనాడుకు చెందిన ఓ యువతి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కలెక్టర్ అవుతుందనుకున్న తమ కుమార్తె అర్థాంతరంగా తనువు చాలించడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. ఈరోడు జిల్లా అదాపాళెయానికి చెందిన తంగరాజ్ ఏకైక కుమార్తె శ్రీమతి. పూల వ్యాపారి అయిన తంగరాజ్ తన కుమార్తెను కలెక్టర్‌గా చూడాలనుకున్నాడు. దీంతో ఆరు నెలల క్రితం ఆమెను ఢిల్లీలోని ఓ ఐఏఎస్ అకాడమీలో చేర్చాడు. అక్కడి హాస్టల్‌లో ఉంటూ ఐఏఎస్‌కు శిక్షణ పొందుతున్న ఆమె శనివారం అర్ధరాత్రి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

ఢిల్లీ పోలీసుల నుంచి సమాచారం అందుకున్న తంగరాజ్ దంపతులు వెంటనే ఢిల్లీ బయలుదేరారు. శ్రీమతి మృతికి కారణాలు తెలియరాలేదని, దర్యాప్తు అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు. అయితే, గత కొంతకాలంగా ఆమె మానసిక సమస్యలతో బాధపడుతున్నట్టు ప్రాథమిక విచారణలో తేలిందన్నారు. పోస్టుమార్టం అనంతరం శ్రీమతి మృతదేహాన్ని తల్లిదండ్రులకు అప్పగించారు. 

New Delhi
Tamilnadu
Girl
Suicide
IAS
Erode
  • Loading...

More Telugu News