Muragadas: ఈ ఘటన నన్ను బాధించింది.. నా గుండె ఆగినంత పనైంది: మురగదాస్

  • చిత్రకథ తనదేనంటూ హైకోర్టును ఆశ్రయించిన వరుణ్
  • ఇద్దరి కథలకూ ఉన్న పోలిక ఒక్కటే
  • ఉదయం నుంచి రాత్రి వరకు ఈ కథ కోసం కష్టపడ్డాను

ఇళయ దళపతి విజయ్ సినిమాలకు వివాదాలు కొత్తేం కాదు. ‘మెర్సల్’ కూడా వివాదాల నడుమే ప్రేక్షకుల ముందుకొచ్చి అద్భుత విజయాన్ని సాధించింది. అలాగే ఆయన నటించిన ‘సర్కార్’ చిత్రం ఫస్ట్‌లుక్‌తోనే వివాదాస్పదమైంది. దీనికి కారణం ఫస్ట్‌లుక్‌‌లో విజయ్ ధూమపానం చేస్తూ కనిపించడమే.

ఇప్పుడు ఈ సినిమా విడుదలకు దగ్గర పడుతోంది. ఈ సమయంలో ఈ సినిమా కథ తనదేనని.. కాబట్టి తనకు రూ.30 లక్షల నగదు.. చిత్ర టైటిల్ క్రెడిట్ కూడా దక్కాలంటూ రచయిత వరుణ్ రాజేంద్రన్ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. 2007లోనే తను కథను రాసుకున్నానని.. దాన్ని ‘సర్కార్’గా తెరకెక్కించారని ఆరోపించారు. దీనిపై చిత్ర దర్శకుడు మురగదాస్ స్పందించారు. వరుణ్ పదేళ్ల క్రితం కథ రాసుకుని ఉండొచ్చు కానీ తాను మాత్రం ప్రస్తుత రాజకీయ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని చిత్రాన్ని తెరకెక్కించానని తెలిపారు.

‘‘వ‌రుణ్‌ అనే ర‌చ‌యిత‌ను నేను నా జీవిత కాలంలో క‌ల‌వ‌లేదు. ఆయ‌న 2007లో క‌థ రాసుకున్నారు. కానీ నా సినిమాను ప్రస్తుత రాజకీయాల నేపథ్యంలో తెరకెక్కించాను. జ‌య‌ల‌లిత మరణాన్ని కూడా మా సినిమాలో చూపించాం. అలాంటపుడు 2007లో రాసిన కథ, ఈ కథ ఒకటనడం సరికాదు.

వ‌రుణ్ క‌థ‌కు, నా కథ‌కు ఉన్న పోలిక ఒక్క‌టే. ఇద్దరి కథలు ఓట్లను ఎలా దుర్వినియోగం చేశారు? అన్న నేపథ్యంలో ఉంటాయి. అయినా మా సినిమా చూడ‌కుండా చాలా రాద్ధాంతం చేస్తున్నారు. ఈ ఘ‌ట‌న న‌న్ను చాలా బాధించింది. నా గుండె ఆగినంత ప‌నైంది. నా ఆఫీస్‌లో కూర్చుని అసిస్టెంట్లతో కలిసి కొన్ని రోజులు ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 వరకు ఈ కథ కోసం కష్టపడ్డాను’’ అని మురుగదాస్ వాపోయారు.

Muragadas
Vijay
Mersal Movie
Sarkar Movie
Varun Rajendran
Madras High Court
  • Loading...

More Telugu News