kcr: అమరావతి నిర్మాణానికి రూ. 100 కోట్లు ఇవ్వాలని కేసీఆర్ అనుకున్నారు.. మోదీ వల్ల అది జరగలేదు: కేటీఆర్
- అమరావతి శంకుస్థాపన వేదికపై నుంచి తెలంగాణ తరపున ప్రకటించాలనుకున్నారు
- మోదీ ఏం ప్రకటించనున్నారని ఆయన ప్రిన్సిపల్ సెక్రటరీని అడిగారు
- తట్టెడు మట్టి, చెంబుడు నీళ్లు తెచ్చామని.. ఇంకేమీ లేదని ఆయన చెప్పారు
- తాను 100 కోట్లు ప్రకటిస్తే మోదీ అహం దెబ్బ తింటుందని కేసీఆర్ భావించారు
- ఎంతో ఆవేదనతో హైదరాబాదుకు తిరిగి వచ్చారు
బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఇరు తెలుగు రాష్ట్రాలకు అన్యాయం చేశాయని కేటీఆర్ మండిపడ్డారు. అమరావతి శంకుస్థాపనకు కేసీఆర్ ను చంద్రబాబు ఆహ్వానించారని... ఆ కార్యక్రమానికి వెళ్లే విషయమై పార్టీలో చర్చించామని ఆయన తెలిపారు. కొందరు నేతలు వెళితే బాగోదని చెప్పారని... ఎక్కువ మంది అక్కడున్నది కూడా మన సోదరులేనని, వారు అమరావతి అనే కొత్త ఇల్లు కట్టుకుంటున్నప్పుడు మనం వెళితేనే బాగుంటుందని చెప్పారని అన్నారు.
శంకుస్థాపన కార్యక్రమం సందర్భంగా, అమరావతిలో ఏర్పాటు చేసిన వేదికపైకి కేసీఆర్ వెళ్లగానే అక్కడున్న ఏపీ ప్రజలంతా హర్షధ్వానాలు చేశారని కేటీఆర్ చెప్పారు. ప్రజల్లో విభేదాలు లేవు, తెలుగువారంతా ఒకటే అనేదే ప్రజల భావన అనే విషయం తమకు అప్పుడే అర్థమయిందని తెలిపారు. ప్రజల్లో పొరపొచ్చాలు లేవని... రాజకీయ పార్టీల్లోనే విభేదాలు ఉంటాయని... టీఆర్ఎస్, టీడీపీ మధ్య.. కేసీఆర్, చంద్రబాబు మధ్య రాజకీయపరమైన పంచాయతీలు ఉంటాయని అన్నారు. వేదకపై ప్రధాని మోదీతోపాటు అప్పటి కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు కూడా ఆసీనులయ్యారని చెప్పారు. వాస్తవానికి వేదికపై నుంచి అమరావతి నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం తరపున రూ. 100 కోట్లు ప్రకటించాలని కేసీఆర్ అనుకున్నారని తెలిపారు.
సాధారణంగా ప్రొటోకాల్ ప్రకారం అందరూ ప్రసంగించిన తర్వాత ప్రధానమంత్రి ప్రసంగిస్తారని... పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి కాబట్టి కేసీఆర్ కు ముందు మాట్లాడే అవకాశం ఇచ్చారని కేటీఆర్ చెప్పారు. కేసీఆర్ గారికి ఎందుకో అనుమానం వచ్చిందని... ప్రధానమంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీని పిలిచి... అమరావతి నిర్మాణానికి ప్రధాని ఏం ప్రకటించబోతున్నారని అడిగారని తెలిపారు.
ఆయనకంటే ముందు తాను మాట్లాడాలని... ప్రధాని ఏం ప్రకటించబోతున్నారో చెబితే, తాను ప్రకటించాల్సింది ప్రకటిస్తానని అడిగారని చెప్పారు. దానికి సమాధానంగా... ఢిల్లీ నుంచి తట్టెడు మట్టి, చెంబుడు నీళ్లు తెచ్చామని... ఇంకేమీ లేదని ప్రిస్సిపల్ సెక్రటరీ సమాధానమిచ్చారని తెలిపారు. దీంతో, కేసీఆర్ ఉలిక్కిపడ్డారని చెప్పారు. తాను రూ. 100 కోట్లు ప్రకటించి, ఆయన ఏమీ ప్రకటించకపోతే... ఆయన అహం దెబ్బతింటుందని కేసీఆర్ భావించారని... లేనిపోని పంచాయతీలు వచ్చే ప్రమాదం ఉందని వెనకడుగు వేశారని తెలిపారు. దీంతో, ఏపీ ప్రజలకు శుభాకాంక్షలు మాత్రమే చెప్పి వచ్చారని అన్నారు.
ఆ తర్వాత ఎంతో ఆవేదనతో కేసీఆర్ హైదరాబాదుకు వచ్చారని కేటీఆర్ తెలిపారు. తమకు రెండు విషయాలను కేసీఆర్ చెప్పారని... ఏపీ ప్రజలు తనను ఎంతో అభిమానంతో స్వాగతించారని చెప్పారని అన్నారు. అమరావతికి ప్రధాని ఏదో ప్రకటిస్తారని అనుకుంటే... ఆయన ఏమీ ప్రకటించకపోవడం ఆశ్చర్యాన్ని కలగజేసిందని కేసీఆర్ చెప్పారని తెలిపారు. కాంగ్రెస్, బీజేపీలది ఒకటే వైఖరని... ఈ పార్టీల బాస్ లు ఢిల్లీలో ఉంటారని... ముఖ్యమంత్రులన్నా వారికి చిన్న చూపేనని చెప్పారు. ప్రజల ఆంకాంక్షలను పట్టించుకోరని మండిపడ్డారు. మన నాయకులు పోయి అక్కడ వాళ్ల ఇళ్ల ముందు క్యూ లైన్లలో నిలబడాలని విమర్శించారు.