kcr: చంద్రబాబు చేసిన పనికి ఆయనను తప్పు పట్టలేం!: కేటీఆర్
- తెలంగాణ ప్రాజెక్టులపై చంద్రబాబు లేఖలు రాశారు
- ఏపీ ముఖ్యమంత్రిగా అది ఆయన బాధ్యత
- గోదావరి, కృష్ణా జలాల్లో 1200 టీఎంసీలపై తెలంగాణకు హక్కు ఉంది
చంద్రబాబును విమర్శించడానికి కొన్ని కారణాలు ఉన్నాయనే విషయం వాస్తవమని కేటీఆర్ అన్నారు. చంద్రబాబు పార్టీలో ఉన్న ఒక ఎమ్మెల్యే టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనే ప్రయత్నం చేశారని చెప్పారు. అది దాచినా దాగని నిజమని తెలిపారు. మన ప్రభుత్వాన్ని పడగొట్టే ప్రయత్నం చంద్రబాబు చేస్తే సహజంగానే మనకు కోపం వస్తుందని... కోపం రాకపోతే మనం మనుషులమే కాదని అన్నారు. తెలంగాణ ప్రాజెక్టులను ఆపాలని చంద్రబాబు లేఖలు రాశారని చెప్పారు. ఇలాంటి నేపథ్యంలోనే, వివిధ పార్టీల నేతలు ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటుంటారని అన్నారు. హైదరాబాదులోని నిజాంపేటలో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రసంగిస్తూ, ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
వాస్తవానికి చంద్రబాబును కూడా తప్పు పట్టలేమని... ఏపీ ముఖ్యమంత్రిగా ఆ రాష్ట్ర ప్రయోజనాల కోసం పాటుపడాల్సిన బాధ్యత ఆయనపై ఉందని కేటీఆర్ తెలిపారు. ఎగువన ఉన్న రాష్ట్రాలు ప్రాజెక్టులు కడితే, ఏపీకి నీరు రాదనే ఆందోళనతో ఆయన లేఖలు రాసి ఉండవచ్చని చెప్పారు. తెలంగాణ పోరాటంలో నీటీ సమస్య ప్రధానమైనదని... గోదావరి, కృష్ణా జలాల్లో 1200 టీఎంసీలపై తెలంగాణకు హక్కు ఉందని తెలిపారు. మన హక్కును చంద్రబాబు కాదంటే మనకు అభ్యంతరం ఉంటుందని చెప్పారు.
ఇక్కుడుండే రాయలసీమ, కోస్తాంధ్ర ప్రజలకు తాను ఒకటే మాట ఇస్తున్నానని... మీలో ఒక వ్యక్తిగా మీకు అన్ని విధాలుగా అండగా ఉంటానని కేటీఆర్ తెలిపారు. మీ మనసులో ఉన్న అనుమానాలన్నింటినీ పక్కన పెట్టాలని విన్నవిస్తున్నానని అన్నారు. ఓట్ల కోసం తప్పుడు మాటలు చెప్పే వ్యక్తిని తాను కాదని చెప్పారు.