Andhra Pradesh: జగన్ పై దాడి కేసు.. నిందితుడు శ్రీనివాసరావుకు జ్యుడీషియల్ రిమాండ్!
- నవంబర్ 2 వరకూ విధించిన కోర్టు
- అదుపులోకి తీసుకోనున్న పోలీసులు
- 11 పేజీల లేఖ ఆధారంగా ప్రశ్నలు
ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ పై ఇటీవల విశాఖపట్నం విమానాశ్రయంలో హత్యాయత్నం జరిగిన సంగతి తెలిసిందే. ఎయిర్ పోర్టులోని ఓ హోటల్ లో వెయిటర్ గా పనిచేస్తున్న శ్రీనివాసరావు అనే యువకుడు కోడి పందేల సందర్భంగా వాడే కత్తితో జగన్ పై దాడి చేసినట్లు అధికారులు గుర్తించారు. దాడి జరిగిన వెంటనే పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో అతడిని ఈ రోజు కోర్టు ముందు హాజరుపర్చగా, వచ్చే నెల 2 వరకూ జ్యుడీషియల్ రిమాండ్ కు తరలించాలని కోర్టు ఆదేశించింది.
శ్రీనివాసరావును విచారించేందుకు వీలుగా తమ కస్టడీకి అప్పగించాలన్న పోలీసుల విజ్ఞప్తికి న్యాయమూర్తి సానుకూలంగా స్పందించారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం విశాఖ పట్నం సెంట్రల్ జైలులో ఉన్న శ్రీనివాసరావును మరికాసేపట్లో పోలీసులు అదుపులోకి తీసుకోనున్నారు. జగన్ పై దాడికి ఎవరు పురిగొల్పారు? ఈ కుట్ర వెనుక ఎవరున్నారు? విజయలక్ష్మీ, చైతన్య అనే స్నేహితుల సాయం తీసుకుని ఎందుకు లేఖ రాయాల్సి వచ్చింది? వంటి విషయాలపై అధికారులు ప్రశ్నల వర్షం కురిపించనున్నారు. అలాగే 11 పేజీల లేఖపై సైతం పోలీసులు శ్రీనివాసరావును ప్రశ్నించనున్నారు.