Andhra Pradesh: జగన్ మెడికల్ రిపోర్టులో నేనలా చెప్పలేదు.. కొన్ని మీడియా ఛానల్స్ దుష్ప్రచారం చేస్తున్నాయి!: అపోలో డాక్టర్ స్వాతి
- నేను ప్రథమ చికిత్స మాత్రమే చేశా
- జగన్ చొక్కా అంతా రక్తంతో తడిసిపోయింది
- నా ఫ్రెండ్ తో మాట్లాడిన కాల్ ను కూడా రికార్డు చేశారు
తాను ఇచ్చిన మెడికల్ రిపోర్టుపై కొన్ని మీడియా సంస్థలు దుష్ప్రచారం చేస్తున్నాయని అపోలో మెడికల్ సెంటర్ వైద్యురాలు డా.కె.లలిత స్వాతి తెలిపారు. ఎయిర్ పోర్టులో ఉండగానే ‘జగన్ పై అటాక్ చేశారు. వెంటనే రండి’ అంటూ కొందరు యువకులు తన వద్దకు పరుగుపరుగున వచ్చారని తెలిపారు. ‘నేను వెంటనే స్టెత్కసోప్, బీపీ మెషీన్ పట్టుకుని అక్కడకు పరిగెత్తా. జగన్ చొక్కా మొత్తం రక్తంతో తడిసిపోయింది. నన్ను చూడగానే ఆయన 'జాగ్రత్త తల్లీ' అని చెప్పారు. దీంతో నేను వెంటనే కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం (సీఐఎస్ఎఫ్) అధికారుల దగ్గరున్న ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకుని ప్రథమ చికిత్స చేశాను.
అంతకుమించి ఎలాంటి చికిత్స చేయలేదు. దాదాపు 0.5 సెంటీమీటర్ల లోతులో కత్తి దిగి ఉండొచ్చని రిపోర్టు ఇచ్చా. అదీ పోలీస్ అధికారులు తొందరగా ఇవ్వాలని ఒత్తిడి చేయడంతో ఇవ్వాల్సి వచ్చింది. గాయం లోతు అంతకంటే ఎక్కువగానే ఉండొచ్చని భావించా. కానీ కొన్ని టీవీ ఛానల్స్ మాత్రం ఆ రిపోర్టును పట్టుకుని తప్పుడు ప్రచారానికి దిగాయి’ అని స్వాతి తెలిపారు.
తాను ఫ్రెండ్ తో మాట్లాడిన మాటల్ని సైతం రికార్డు చేసి తమకు అనుకూలంగా ప్రసారం చేసుకున్నారని విమర్శించారు. ఇలాంటి ఘటనల్లో కత్తికి విష రసాయనాలు ఉండే అవకాశం ఉందనీ, అందువల్లే హైదరాబాద్ లో ఆపరేషన్ చేసి కుట్లు వేయాల్సి వచ్చిందని వ్యాఖ్యానించారు. గాయం లోతు కేవలం 0.5 సెంటీమీటర్లు మాత్రమేనని తాను చెప్పినట్లు వస్తున్న వార్తలు నిజం కాదని స్వాతి స్పష్టం చేశారు.