Pakistan: పాకిస్తాన్ ను తీవ్రంగా హెచ్చరించిన భారత సైన్యాధిపతి బిపిన్ రావత్
- కశ్మీర్ విషయంలో భారత్ పై పైచేయి సాధించలేని పాక్ చర్యలివి
- రాళ్లదాడిలో జవాన్ మృతిపై ఆగ్రహం
- పాక్ ప్రయత్నాలను అడ్డుకునే సామర్థ్యం భారత్ కు ఉంది
భారత సైన్యాధిపతి బిపిన్ రావత్ పాకిస్తాన్ ను తీవ్రంగా హెచ్చరించారు. జమ్ముకశ్మీర్ లోని అనంత్ నాగ్ జిల్లాలో శుక్రవారం సాయంత్రం జరిగిన రాళ్ల దాడిలో జవాను రాజేంద్ర సింగ్(22) మృతి చెందిన ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జమ్ము కశ్మీర్ విషయంలో భారత్ పై ఎప్పటికీ విజయం సాధించలేదని అర్థం చేసుకున్న పాకిస్తాన్.. ఆ ప్రాంతంలో ఉగ్రవాదులు ప్రవేశించేందుకు సాయం చేస్తూ అలజడి సృష్టించాలని ప్రయత్నిస్తోందన్నారు. కశ్మీర్లో అభివృద్ధిని అడ్డుకోవాలని పాక్ భావిస్తోందని, ఆ ప్రయత్నాలను తిప్పికొట్టే సామర్థ్యం భారత్ కు ఉందన్నారు. పాక్ ప్రయత్నాలను అడ్డుకునే అన్ని ఆపరేషన్ లను సమర్థవంతంగా నిర్వహించగలుగుతామని స్పష్టం చేశారు.
సరిహద్దు రోడ్ల సంస్థ బృందానికి భద్రత కల్పిస్తున్న బృందంపై ఓ సమూహం రాళ్లతో దాడి చేసిందని, ఈ దాడిలో ఓ జవాను అమరుడయ్యాడని వెల్లడించారు. రాళ్లు రువ్వే వారిని ఉగ్రవాదులకు సాయం అందించే వారిగా చూడొద్దంటూ కొందరు సూచిస్తున్నారని బిపిన్ రావత్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇదిలావుండగా జమ్ము కశ్మీర్ లోని అనంత నాగ్ జిల్లాలో శుక్రవారం సాయంత్రం ‘సరిహద్దు రోడ్డు సంస్థ’ బృందానికి భద్రత కల్పిస్తున్న జవానులపై ఓ గుంపు రాళ్ల దాడి చేసింది. ఈ దాడిలో తలకు బలమైన గాయమవ్వడంతో హాస్పిటల్లో చికిత్స పొందుతూ రాజేంద్ర సింగ్ అనే 22 ఏళ్ల జవాను అమరుడయ్యాడు.