Andhra Pradesh: నువ్వు 2002లో సీఎం అయ్యావ్.. నేను 1995లో ఆ బాధ్యతలు చేపట్టా!: ప్రధాని మోదీపై చంద్రబాబు ఫైర్

  • ఢిల్లీకి ఫైళ్లు పట్టుకుని 29 సార్లు తిరిగా
  • ఓపికతో సమస్యల పరిష్కారానికి యత్నించా
  • నాకే పరిపక్వత లేదంటారా?

ఆంధ్రప్రదేశ్ లో నెలకొన్న ప్రత్యేక పరిస్థితి దృష్ట్యా 2014లో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ రాష్ట్రానికి ప్రత్యేకహోదా ప్రకటించారని సీఎం చంద్రబాబు తెలిపారు. ఇచ్చిన హామీలను నెరవేరుస్తారన్న నమ్మకంతో బీజేపీతో చేరామనీ, కానీ తమకు నమ్మకద్రోహం చేశారని ఆరోపించారు. విభజన హామీలు అమలు చేయాలనీ, ఏపీని ఆదుకోవాలని కోరుతూ తాను 29 సార్లు ఢిల్లీకి వచ్చానని చంద్రబాబు గుర్తుచేశారు. ఢిల్లీలోని కాన్ స్టిట్యూషన్ క్లబ్ లో ఈ రోజు నిర్వహించిన మీడియా సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు.

ఎన్డీయే ప్రభుత్వంలో తాము కలిసి ఉన్నప్పటికీ, టీడీపీని దెబ్బతీసే ప్రయత్నాలు చేశారని తెలిపారు. ఇదేం రకమైన రాజకీయ నైతికత? అని చంద్రబాబు ప్రశ్నించారు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ నేతలు తమను కాదని వైసీపీ నేతల సాయం తీసుకున్నారని విమర్శించారు. బీజేపీ-వైసీపీల మధ్య రహస్య ఒప్పందం ఉందని ఆరోపించారు. రాజకీయ నేతలపై ఉండే అవినీతి కేసులను ఏడాదిలోగా తేల్చేసేలా చర్యలు తీసుకుంటామని గతంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారని చంద్రబాబు గుర్తుచేశారు. కానీ ఇప్పుడు తనకు నచ్చని వాళ్లపై ఐటీ దాడులు చేయించడం, వేధించడం వంటి చర్యలు సాగుతున్నాయని విమర్శించారు.

అవినీతి, ఆర్థిక అవకతవకల్లో నిందితులుగా ఉన్న వ్యక్తులు తప్పించుకుంటున్నారని చంద్రబాబు అన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రజల అభీష్టం మేరకు ఎన్టీయే కూటమి నుంచి తప్పుకున్నట్లు వెల్లడించారు. బీజేపీ వ్యవహారశైలిని నిరసిస్తూ కేంద్రంపై అవిశ్వాస తీర్మానం పెట్టామన్నారు. తమ ఉద్దేశానికి అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ఇచ్చాయని గుర్తుచేశారు. ప్రధాని మోదీ అవినీతి ఉచ్చులో చిక్కుకున్నారని అన్నారు. చాలా విషయాల్లో తాను సర్దుకు పోయాననీ, కానీ ఎన్డీయే ప్రభుత్వం నుంచి సహకారం లభించలేదని స్పష్టం చేశారు.

మోదీని ఉద్దేశించి మాట్లాడుతూ..'నువ్వు 2002లో గుజరాత్ ముఖ్యమంత్రి అయితే.. నేను 1995లోనే సీఎం అయ్యా. నాకు పరిపక్వత లేదంటావా? దాని అర్థం ఏమిటి? దేశంలో రెండో తరం ఆర్థిక సంస్కరణలను నేను అమలు చేశా. వీటిపై తొలిసారి నేనే మాట్లాడా. దాని కారణంగానే ఈ రోజు హైదరాబాద్ ప్రపంచపటంపై ఉంది. నేను సంస్కరణలను అమలు చేయకుంటే హైదరాబాద్ ఇలా ఉండేదే కాదు’ అని వ్యాఖ్యానించారు.

ఏపీ, తెలంగాణతో సమావేశాలు నిర్వహించి పెద్దమనిషిగా సమస్యల పరిష్కారానికి మోదీ పనిచేసి ఉండాల్సిందని చంద్రబాబు తెలిపారు. కానీ రెండు రాష్ట్రాల మధ్య గొడవలు రెచ్చగొట్టేందుకు మోదీ యత్నించారని ఆరోపించారు. రాష్ట్రానికి వ్యతిరేకంగా బీజేపీ పనిచేస్తోందన్నారు. ఇప్పుడున్న వేగంతోనే పనులు చేపడితే కేంద్ర ప్రభుత్వ సంస్థలన్నీ ఏపీలో ఏర్పాటు కావడానికి మరో 30 ఏళ్లు పడుతుందని అన్నారు.

  • Loading...

More Telugu News