Chandrababu: ఢిల్లీకి చేరుకున్న చంద్రబాబు.. మరికాసేపట్లో కేజ్రీవాల్, యశ్వంత్ సిన్హాతో భేటీ!
- టీడీపీ ఎంపీలతో చంద్రబాబు భేటీ
- భవిష్యత్ కార్యాచరణపై చర్చ
- 3 గంటలకు జాతీయ మీడియాతో సమావేశం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు ఢిల్లీ చేరుకున్నారు. తొలుత ఏపీ భవన్ లో టీడీపీ పార్లమెంటు సభ్యులతో బాబు సమావేశమయ్యారు. జగన్ పై దాడి, గవర్నర్ నరసింహన్ వ్యవహారశైలి, పలు ప్రాజెక్టులపై కేంద్రం సహాయ నిరాకరణ సహా పలు అంశాలపై వారితో చర్చించారు. కేంద్రం కుట్రలను జాతీయ స్థాయిలో ఎండగట్టాలని ఈ సమావేశంలో నిర్ణయించారు.
ఇందులో భాగంగా ఈరోజు మధ్యాహ్నం 1.30 గంటలకు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్ సిన్హా, శరద్ యాదవ్ తదితరులు చంద్రబాబుతో భేటీ కానున్నారు. వీరంతా ఏపీ భవన్ లో చంద్రబాబుతో సమావేశమై దేశవ్యాప్తంగా నెలకొన్న రాజకీయ పరిస్థితి, పాలనలో గవర్నర్ల అనవసర జోక్యంపై చర్చించనున్నారు. ఏపీలో రాష్ట్రపతి పాలన విధించేందుకు కేంద్రం యత్నిస్తోందని భావిస్తున్న టీడీపీ అధినేత.. ప్రధాని మోదీ ఎత్తులకు చెక్ పెట్టే దిశగా అడుగులు వేస్తున్నారు.
ఢిల్లీలోని ఏపీ భవన్ లో విశ్రాంతి తీసుకుంటున్న చంద్రబాబు ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు ఢిల్లీలోని కాన్ స్టిట్యూషన్ క్లబ్ లో జాతీయ మీడియా సమావేశంలో పాల్గొంటారు. కాగా, ఈ సమావేశంలో చంద్రబాబు కాంగ్రెస్ పార్టీతో కలిసి వెళతారా? లేక మూడో కూటమిని ప్రకటిస్తారా? అన్న విషయమై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.