electic shock: విద్యుదాఘాతానికి మూగజీవాల బలి.. ఒడిశాలో ఏడు ఏనుగుల మృతి
- ధేంకనాల్ జిల్లా అటవీ ప్రాంతం సమీపంలో ఘటన
- రైలు పట్టాలు దాటుతుండగా వేలాడుతున్న విద్యుత్ తీగ తగిలి దుర్మరణం
- ఘటనా స్థలికి చేరుకుని దర్యాప్తు చేస్తున్న అటవీ అధికారులు
వేలాడుతున్న విద్యుత్ తీగ ఏడు మూగజీవాల ప్రాణాలను హరించింది. ఆహారం వెతుక్కునే పనిలో ఉన్న ఏనుగు రైలు ట్రాక్ దాటుతుండగా సరఫరా జరుగుతున్న విద్యుత్ తీగ తగలడంతో విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందాయి. ఒడిశా రాష్ట్రం ధేంకానాల్ జిల్లా కమలాంగా గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
నేటి ఉదయం అటుగా వెళ్తున్న స్థానికులు రైలు ట్రాక్ పక్కన చనిపోయి పడివున్న ఏనుగులను చూసి అటవీ అధికారులకు సమాచారం ఇచ్చారు. వారు వచ్చి పరిశీలించగా ట్రాక్ పక్కనే వేలాడుతున్న ఓ విద్యుత్ తీగను గుర్తించారు. ప్రమాదానికి ఈ తీగ కారణమై ఉండవచ్చునని భావిస్తున్నారు. గత వారం నాగాలాండ్‌లోని వోఖా జిల్లాలో విద్యుదాఘాతంతో రెండు ఏనుగులు మృతి చెందాయి. ఆసియాలో ఏనుగుల సంతతి అధికంగా ఉన్న దేశం మనదే. ఇలాంటి ఘటనలతో వాటి సంఖ్య తగ్గిపోతుండడంపై వన్యప్రాణుల సంరక్షకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.