kedar jadav: అనూహ్యంగా జట్టులో సవరణ.. వెస్టిండీస్‌తో చివరి రెండు వన్డేలకు కేదార్ జాదవ్‌కు చోటు!
- మనసు మార్చుకుని మళ్లీ అవకాశం ఇచ్చిన ఎంపిక కమిటీ
- బీసీసీఐ అధికారిక ట్విట్టర్లో ట్వీట్
- జాదవ్ విమర్శల పర్యవసానమా?
భారత్ పర్యటనలో ఉన్న వెస్టిండీస్‌తో జరగనున్న చివరి రెండు వన్డేలకు జట్టులో మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మన్ కేదార్ జాదవ్‌కు చోటు దక్కింది. విశాఖ వన్డే అనంతరం చివరి మూడు మ్యాచ్‌లకు సెలక్షన్ కమిటీ గురువారం ప్రకటించిన జట్టులో జాదవ్ పేరు లేని విషయం తెలిసిందే. దీనిపై జాదవ్ ఆవేదన వ్యక్తం చేస్తూ ‘ఫిట్నెస్ కారణంగా నన్ను పక్కన పెట్టినట్లు గతంలో ప్రకటించిన సెలక్షన్ కమిటీ, నేను ఫిట్నెస్ సాధించిన తర్వాత కూడా ఎందుకు చోటు కల్పించలేదో తెలియదు. కనీసం దీనిపై సమాచారం కూడా ఇవ్వలేదు’ అంటూ వాపోయాడు.
దీంతో తొలుత పరిస్థితి అర్థం చేసుకోవాలని కోరిన చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్, ఆ తర్వాత ఏమైందో ఏమో చివరి రెండు వన్డేల్లో జాదవ్‌కు చోటు కల్పిస్తున్నట్లు ప్రకటించి ఆశ్చర్యపరిచారు. ‘కేదార్ జాదవ్ తరచూ గాయపడతాడన్న కారణంగానే అతనిని మూడో వన్డేకు ఎంపిక చేయలేదు. గతంలోనూ ఒకటి రెండుసార్లు అతను జట్టులోకి రావడం, వెంటనే గాయపడడం జరిగింది. దీన్ని దృష్టిలో పెట్టుకునే అతనికి అవకాశం ఇవ్వలేదు’ అన్నది చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ మాట. చివరికి జాదవ్ విమర్శలకు దిగివచ్చారో, మరో కారణం ఉందో కానీ, చివరి రెండు వన్డేలకు జట్టులో జాదవ్‌కు స్థానం కల్పించి అతనికి ఊరటనిచ్చారు.