mother and daughter suicide: తల్లీకూతుర్ల విషాదాంతం...బిడ్డను చంపి తానూ ఆత్మహత్య!
- ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త హఠాన్మరణంతో అంతులేని ఆవేదన
- తాను చనిపోతే కూతురు భవిష్యత్తు ఏమవుతుందో అన్న ఆందోళన
- నైట్రోజన్ గ్యాస్ విడుదల చేసి కూతురితోపాటు బలవన్మరణం
ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఓ బిడ్డకు తల్లి అయ్యింది. జీవితం హాయిగా సాగిపోతోందనుకునే సమయంలో భర్త గుండెపోటుతో చనిపోవడం షాక్ ఇచ్చింది. ఒక్కసారిగా లోకమే చీకటి అయిపోయినంతగా భావించిందామె. భర్తతోపాటు తానూ పోవాలని అనుకున్నా కూతురి భవిష్యత్తు ఆమె కాళ్లకు బంధం వేసింది. ఈ భయంతోనే కూతురిని చంపి తానూ ఆత్మహత్యకు పాల్పడింది. రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపిన ఈ ఘటన హైదరాబాద్ చిలకలగూడ ఠానా పరిధిలో శుక్రవారం చోటు చేసుకుంది.
పోలీసుల కథనం మేరకు... మెట్టుగూడకు చెందిన సిద్ధార్థ్ అలియాస్ టిటోన్, ఆర్తి (38) ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి ఏడేళ్ల కుమార్తె తషీ ఉంది. వ్యాపారస్తుడైన సిద్ధార్థ్ ఈ ఏడాది జూన్‌లో గుండెపోటుతో చనిపోయాడు. ఈ ఘటనతో ఆమె జీవితాన్ని ఒక్కసారిగా శూన్యం ఆవరించినట్టయింది.
భర్త జ్ఞాపకాలతోనే గడుపుతున్న ఆమె, తన తల్లి పుట్టింటికి వచ్చేయమని చెప్పినా అంగీకరించ లేదు. అత్త, మరిదితో కలిసి అత్తవారింట్లోనే ఉంటోంది. ఇంతలోనే భర్తలేని జీవితం ఎందుకనుకుందో ఏమో చనిపోవాలని నిర్ణయించుకుంది. శుక్రవారం అత్త, మరిది బయటకు వెళ్లగానే ముందుగానే బుక్ చేసి తెచ్చిపెట్టుకున్న నైట్రోజన్ గ్యాస్ సిలిండర్‌ను ఓపెన్ చేసింది. తొలుత కుమార్తె ముఖానికి కవర్ తొడిగి గ్యాస్ విడుదల చేయడంతో ఆ చిన్నారి మృతి చెందింది. అనంతరం తాను కూడా కవరు తొడుక్కుని గ్యాస్ విడుదల చేసి ప్రాణాలు వదిలింది.
బయటకు వెళ్లిన అత్త, మరిది మధ్యాహ్నం రెండు గంటల సమయంలో ఇంటికి వచ్చారు. తల్లీకుమార్తెలు విగతజీవులుగా పడి ఉండడంతో షాక్‌కు గురయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ‘పది రోజుల కిందటే ఆర్తి నైట్రోజన్ సిలిండర్ బుక్ చేసింది. ఎందుకని ప్రశ్నిస్తే స్నేహితురాలిదని, ఆమె ఊరెళ్లడంతో మన ఇంట్లో పెట్టించిందని చెప్పింది’ అన్న కుటుంబ సభ్యుల కథనం బట్టి ఆర్తి ముందస్తు నిర్ణయంతోనే ఆత్మహత్యకు పాల్పడిందని పోలీసులు భావిస్తున్నారు.
అయితే ఆర్తి భర్త సిద్ధార్థ్ పేరు మీద ఇంటి ముందు విశాలమైన స్థలం ఉంది. ఈ స్థలం వివాదంలో ఉండడంతో తల్లీకూతుళ్ల మృతి వెనుక ఈ వివాదం ప్రభావం ఏమైనా ఉందా? అన్న కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.