CNG vehicles: సీఎన్‌జీ వాహనాలకు ఇకపై పర్మిట్లు తప్పనిసరి: స్పష్టం చేసిన కేంద్రం

  • మిథనాల్‌, ఇథనాల్‌, విద్యుత్‌ వాహనాలకు మాత్రమే మినహాయింపు
  • సవరించిన ఉత్తర్వులు జారీ
  • ఒక్కో వాహన యజమానిపై రూ.లక్ష వరకు భారం

వాహనాల పర్మిట్ల అంశంపై కేంద్రం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. కంప్రెష్డ్ నేచురల్‌ గ్యాస్‌ (సీఎన్‌జీ)తో నడిచే వాహనాలకు పర్మిట్లు అవసరం లేదని సెప్టెంబరు 7న ఇచ్చిన ఉత్తర్వులను సవరిస్తూ తాజా ఆదేశాలు విడుదల చేసింది. ఈ ఆదేశాల మేరకు మిథనాల్‌, ఇథనాల్‌, విద్యుత్‌ (బ్యాటరీ)తో నడిచే వాహనాలు తప్ప మిగిలిన అన్నింటికీ పర్మిట్లు తప్పనిసరి. కేంద్రం తాజా ఉత్తర్వులతో సీఎన్‌జీ వాహన యజమానులపై లక్ష రూపాయల వరకు పన్ను రూపంలో అదనపు భారం పడే అవకాశం ఉంది.

హైదరాబాద్‌ నగరంలోనే 30 వేల నుంచి 40 వేల వరకు సీఎన్‌జీ వాహనాలున్నాయి. ఇందులో ఆటోలే అధికం. కొంతమంది కార్లకు కూడా సీఎన్‌జీ వినియోగిస్తున్నారు. సీఎన్‌జీ వాహనాల వల్ల వాయు కాలుష్యం ఉండదు. పర్యావరణానికి తీవ్ర హాని చేసే క్లోరోఫ్లోర్‌ కార్బన్ల నియంత్రణ సాధ్యమవుతుంది. ఈ ఉద్దేశంతోనే సీఎన్‌జీ వాహనాలను ప్రోత్సహించాలని గతంలో బ్యూరేలాల్‌ కమిటీ ఇచ్చిన సిఫార్సును అమలు చేయాలని కేంద్రం నిర్ణయించింది.

ఇందులో భాగంగా సీఎన్‌జీ వాహనాలకు పర్మిట్లు అవసరం లేదని సెప్టెంబరులో కేంద్రం ప్రకటించినా రవాణా శాఖకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేయలేదు. రవాణా శాఖ యథావిధిగా సీఎన్‌జీ వాహనాలకు పర్మిట్లు తీసుకోమనడంతో చాలా మంది ఈ వాహనాల కొనుగోలుకు ఆసక్తి చూపించ లేదు. దీనివల్ల సీఎన్‌జీ వాహనాల అమ్మకాలు కూడా తగ్గాయని మార్కెట్‌ వర్గాలు చెబుతున్నాయి. కేంద్రం తాజా ఉత్తర్వులతో సీఎన్‌జీ వాహనాల అమ్మకాలు యథావిధిగా సాగే అవకాశం ఉందని రవాణా శాఖ వర్గాలు చెబుతున్నాయి.

  • Loading...

More Telugu News