Jagan: ఏపీ పోలీసులపై జగన్ నమ్మకం లేదనడంపై వర్ల రామయ్య ఆగ్రహం

  • జగన్ చట్టాన్ని ధిక్కరించారని విమర్శ
  • చంద్రబాబు జీవితం రక్తమయమని నిరూపించాలని భూమనకు సవాల్
  • ఏపీ విషయంలో మోదీ పాత్ర అనుమానాస్పదం

ఆంధ్రప్రదేశ్ పోలీసుల మీద నమ్మకం లేదంటూ జగన్ స్టేట్‌మెంట్ ఇవ్వడం, వాంగ్మూలం ఇచ్చేందుకు నిరాకరించడంపై ఏపీ ఆర్టీసీ చైర్మన్, టీడీపీ నేత వర్ల రామయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ చిన్నపిల్లాడిలా ప్రవర్తిస్తున్నారని, చట్టాన్ని అగౌరవ పరిచారని, చట్టాన్ని ధిక్కరించారని ఆయన విమర్శించారు. తెలంగాణ పోలీసులకు స్టేట్ మెంట్ ఇస్తే ఏం చేసుకుంటారని ప్రశ్నించారు.

చంద్రబాబు జీవితం రక్తమయమని ఆరోపించిన భూమన కరుణాకర్ రెడ్డిపై వర్ల రామయ్య మండిపడ్డారు. చంద్రబాబు జీవితం రక్తమయమని ఎక్కడ చూశారని ప్రశ్నించారు. రహస్యంగా ఎక్కడైనా చాటున చూశారా, చంద్రబాబు ఎవరినైనా కర్రతో కొట్టడం, కత్తితో పొడవడం చూశారా, ఏదైనా కేసులో ఇరుక్కోవడం, జైలుకెళ్లడం, ఏదైనా హత్య కేసులో రిమాండ్‌కు వెళ్లడం చూశారా? అని ప్రశ్నించారు.

బుద్ధిలేని, తప్పుడు మాటలు మాట్లాడవద్దని భూమన కరుణాకర్ రెడ్డిని ఆయన హెచ్చరించారు. ఒక్క కేసులో చంద్రబాబు ఉన్నారని, ఫలానా నేరంలో చంద్రబాబు ఉన్నారని, ఫలానా వ్యక్తిని కత్తితో పొడిచాడని, తప్పుచేశాడని నిరూపించాలని సవాల్ విసిరారు. ఒక నాస్తికుడు అయ్యుండి స్వామివారిని అడ్డుపెట్టుకుని అవినీతికి పాల్పడ్డ పనికిమాలిన వ్యక్తి భూమన కరుణాకర్ రెడ్డి అని విమర్శించారు.

గవర్నర్‌కు ఏదైనా నివేదిక కావాలంటే ప్రభుత్వం నుంచి తీసుకోవాలి. ఆంధ్రప్రదేశ్‌లో ఏదో జరుగుతోందని సృష్టించే ప్రయత్నం చేశారని గవర్నర్‌పై ఆరోపించారు. ఎంపికైన ప్రభుత్వాన్ని కూలదోయడానికి ప్రయత్నం చేస్తే ప్రజలు చూస్తూ ఊరుకోరన్నారు. ప్రధాన మంత్రి పాత్ర ఆంధ్రప్రదేశ్ విషయంలో అడుగడునా అనుమానాస్పదంగా ఉందని, ఏది జరిగినా ‘ఆపరేషన్ గరుడ’ వైపు వెళ్తోందన్నారు.

ఏది జరిగినా చంద్రబాబును సాధించాలని ప్రయత్నిస్తున్నారని, అవసరమైతే భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 356 ఉపయోగించి చంద్రబాబు ప్రభుత్వాన్ని కూలదోయాలని చూస్తున్నారని, అదంత సాధ్యం కాదన్నారు. అవి పగటి కలలేనని, రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపులో ఉన్నాయన్నారు. నిన్న జరిగిన ఘటన కేంద్ర ప్రభుత్వ అధీనంలో ఉన్న ఎయిర్‌పోర్టులో జరిగిందన్నారు.

  • Loading...

More Telugu News