Andhra Pradesh: జగన్ కత్తి దాడి నుంచి తప్పించుకోగానే శ్రీనివాసరావు మమ్మల్ని బ్రతిమాలాడు!: వైసీపీ నేత ఐజయ్య
- అతడిని కొట్టొద్దని జగన్ సూచించారు
- అప్రమత్తంగా ఉండటంతో ప్రమాదం తప్పింది
- దాడి సమయంలో నేనక్కడే ఉన్నా
ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత, వైసీపీ నేత జగన్ పై హత్యాయత్నం జరిగినప్పుడు తాను పక్కనే ఉన్నానని నందికొట్కూరు ఎమ్మెల్యే ఐజయ్య తెలిపారు. సెల్ఫీ కావాలంటూ నిన్న జగన్ ను సమీపించిన శ్రీనివాసరావు మెరుపువేగంతో జగన్ మెడపై వేటు వేసేందుకు యత్నించాడన్నారు. అయితే సెల్ఫీ కోసం జగన్ పక్కకు జరగడంతో ఎడమచేతిపై పోటు పడిందని వెల్లడించారు. ప్రతిపక్ష నేతపై దాడి జరిగితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించిన తీరు దారుణమన్నారు. కర్నూలు జిల్లా నందికొట్కూరులో ఈ రోజు జరిగిన మీడియా సమావేశంలో ఐజయ్య మాట్లాడారు.
వైఎస్ జగన్ పై దాడి విఫలం కావడంతో ‘నన్ను కొట్టొద్దు.. నన్ను కొట్టొద్దు.. పోలీసులకు అప్పగించండి’ అని శ్రీనివాసరావు వేడుకున్నాడని ఐజయ్య తెలిపారు. అప్పుడు జగన్ కూడా ‘అతనిపై ఎవ్వరూ చేయి చేసుకోవద్దు. పోలీసులకు అప్పగించండి’ అని చెప్పారన్నారు. ప్రథమ చికిత్స అనంతరం, టీటీ ఇంజెక్షన్ తీసుకుని జగన్ వైజాగ్ ఎయిర్ పోర్ట్ నుంచి హైదరాబాద్ కు బయలుదేరారని తెలిపారు. ఏపీ డీజీపీ ఆర్పీ ఠాకూర్ చంద్రబాబు కనుసన్నల్లో పనిచేస్తున్నారని ఆరోపించారు. జగన్ పై దాడి ఘటనపై స్వతంత్ర సంస్థలతో దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేశారు.