CBI: ‘సీబీఐ’ కుమ్ములాటలపై ఆందోళనలు.. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీని అరెస్ట్ చేసిన పోలీసులు!
- సీబీఐ డైరెక్టర్ గా అలోక్ వర్మను సెలవుపై పంపిన కేంద్రం
- వ్యతిరేకిస్తూ దేశవ్యాప్త ఆందోళనకు కాంగ్రెస్ పార్టీ పిలుపు
- రాహుల్ సహా పలువురు సీనియర్ నేతల అరెస్ట్
కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) డైరెక్టర్ అలోక్ వర్మను ప్రభుత్వం సెలవుపై పంపడంపై కాంగ్రెస్ పార్టీ ఈ రోజు దేశవ్యాప్త ఆందోళనకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా సీబీఐ కార్యాలయాల ముందు కాంగ్రెస్ శ్రేణులు ఆందోళనకు దిగాయి. కాగా ఢిల్లీలోని సీబీఐ ప్రధాన కార్యాలయం ముందు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కార్యకర్తలతో కలిసి ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ శ్రేణులు సీబీఐ ఆఫీసులోకి దూసుకెళ్లేందుకు యత్నించాయి.
దీంతో వాటర్ కేనన్లు, బాష్పవాయువును ప్రయోగించిన పోలీసులు, ఆందోళనకారులను చెదరగొట్టారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీతో పాటు పలువురు సీనియర్ నాయకులు, కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం సమీపంలోని పోలీస్ స్టేషన్ కు వీరిని తరలించారు. మరోవైపు సీబీఐ చీఫ్ అలోక్ వర్మపై వచ్చిన ఆరోపణలకు సంబంధించి రెండు వారాల్లో విచారణను పూర్తి చేయాలని కేంద్ర ప్రభుత్వానికి, కేంద్ర విజిలెన్స్ కమిషన్ కు సుప్రీంకోర్టు ఈ రోజు ఆదేశాలు జారీ చేసింది.
ఈ విచారణను సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఏకే పట్నాయక్ పర్యవేక్షిస్తారని తెలిపింది. తదుపరి విచారణను నవంబర్ 12వ తేదీకి వాయిదా వేసింది. సీబీఐ డైరెక్టర్ గా తనను తప్పించడంపై అలోక్ వర్మ దాఖలు చేసిన పిటిషన్ ను విచారించిన ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు జారీచేసింది. అలాగే కొత్తగా సీబీఐ తాత్కాలిక డైరెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన మన్నెం నాగేశ్వరరావు ఎలాంటి విధాన పరమైన నిర్ణయాలు తీసుకోరాదని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది.