Andhra Pradesh: నాకూ ఢిల్లీ నుంచి ఫోన్ వచ్చింది.. ఆంధ్రప్రదేశ్ లో ‘ఆపరేషన్ వెర్రి పువ్వు’ జరుగుతోంది!: పోసాని కృష్ణమురళి
- జగన్ పై ఆంధ్రజ్యోతి తప్పుడు కథనాలు
- సానుభూతి కోసం యత్నిస్తున్నారని వార్తలు
- జగన్ ను బతకనివ్వకూడదని అనుకుంటున్నారు
ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత వైఎస్ జగన్ పై దాడి అనంతరం జరుగుతున్న వాదోపవాదాలపై ప్రముఖ సినీ నటుడు పోసాని కృష్ణమురళి స్పందించారు. జగన్ పై జరిగిన దాడిని ప్రస్తావించకుండా ఆంధ్రజ్యోతి సంస్థ.. గాయం లోతెంత? కత్తి ఎంత లోతుకు దిగింది? అంటూ ఇష్టమొచ్చినట్లు కథనాలు ప్రసారం చేసిందని పోసాని మండిపడ్డారు.
ప్రజల సానుభూతి, జాలి కోసం జగన్ ప్రయత్నిస్తున్నాడని వార్తలు రాయడం ఎంతవరకూ సబబని ప్రశ్నించారు. జగన్ చేతికి గాయమైతే, వీపుపై దాడి చేయడానికి వచ్చాడని ఎలా చెబుతారన్నారు. తాను ఈ మధ్య జాతీయ మీడియాను ఫాలో అవుతున్నాననీ, అందులో లుటీన్స్ మీడియా (ఒక వర్గానికి కొమ్ము కాసే మీడియా) అనే పదం ఎక్కువగా వినిపిస్తోందని పోసాని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం ఆంధ్రజ్యోతి కూడా ఇలాగే చేస్తోందంటూ మండిపడ్డారు.
‘ఆపరేషన్ గరుడ’ పై చంద్రబాబు తాజాగా చేసిన వ్యాఖ్యలపై పోసాని స్పందించారు. తనకు కూడా ఢిల్లీ నుంచి ఫోన్‌కాల్ వచ్చిందనీ, ఫోన్ చేసినవారు పప్పు.. దాని పేరు ‘ఆపరేషన్ వెర్రి పువ్వు’ అని వాఖ్యానించారు. దీన్ని ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్న కొంతమంది ప్రముఖులు ప్రయోగిస్తారని.. జగన్ ఉంటే జైల్లో ఉండాలి లేదంటే ఈ భూమి పైనే ఉండకూడదనేది దీని ఉద్దేశమని అన్నారు. శివాజీకి ఎలా ఫోన్ వచ్చిందో తనకు కూడా అలానే వచ్చిందంటూ తెలిపారు.
మెల్లిమెల్లిగా పవన్ కల్యాణ్‌కు ఉన్న ప్రజాదరణను తగ్గించడం, హీరో ఎన్టీఆర్‌ను కూడా రాజకీయంగా దెబ్బతీయాలనుకోవడం.. ఆపరేషన్ వెర్రిపువ్వులో భాగమన్నారు. ప్రస్తుతం ఈ ఆపరేషన్‌లో జగన్‌పై దాడి జరగడం నిజమైందన్నారు. విమానాశ్రయంలో భద్రత కేంద్రానిదేనని చెబుతున్న బాబు.. కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టు అయిన పోలవరాన్ని ఎలా కబ్జా చేశారని ప్రశ్నించారు.