Cheating: పోలీసు ఉన్నతాధికారి స్నేహితుడినంటూ వేషం... దర్జాగా మోసం!
- వజ్రాల వ్యాపారంలో పెట్టుబడి పెడితే అధిక లాభం అంటూ చీటింగ్
- డబ్బు అడిగేసరికి అధికారి పేరు చెప్పి బెదిరింపులు
- మనీ సర్క్యులేషన్ పేరుతో గతంలోనూ మోసాలు
వేషం మార్చి మోసం చేయడం అతనికి అలవాటు. గతంలోనూ మనీ సర్క్యులేషన్ పేరుతో పలువురి నుంచి డబ్బులు వసూలు చేశాడు. తాజాగా యూనివర్సిటీ ప్రొఫెసర్‌నని, వజ్రాల వ్యాపారినని చెప్పి ఓ జిరాక్స్ షాపు యజమాని వద్ద ఐదు లక్షలు వసూలు చేశాడు. అడిగేసరికి తనకు పోలీసు అధికారి స్నేహితుడు అంటూ బెదిరింపులు మొదలుపెట్టాడు. విషయం పోలీసుల వరకు వెళ్లడంతో జైలు ఊచలు లెక్కపెడుతున్నాడు.
వివరాల్లోకి వెళితే... సికింద్రాబాద్ ఎస్‌డీ రోడ్డు శ్రీనాధ్ కాంప్లెక్స్ 405లో నివసించే ఎస్.ఎస్.బాబు, చిక్కడపల్లి జవహర్‌నగర్‌కు చెందిన మెరుగు యాదగిరి (35) జిరాక్స్ కేంద్రానికి (ఇది అశోక్‌నగర్ ప్రధాన రోడ్డులో ఉంది) తరచూ వస్తుండేవాడు. ఆ క్రమంలో తాను ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్‌నని పరిచయం పెంచుకున్నాడు. తరచూ వచ్చి మాయ మాటలు చెబుతుండడంతో యాదగిరి అతని వలలో చిక్కాడు.
తాను వజ్రాల వ్యాపారం చేస్తున్నానని, అందులో పెట్టుబడి పెడితే నెల రోజుల్లో 20 శాతం లాభం వస్తుందని యాదగిరిని నమ్మించాడు. ఎక్కువ డబ్బులు వస్తాయని ఆశపడిన యాదగిరి తొలుత బాబుకు రూ.లక్ష ఇచ్చాడు. ఇరవై రోజుల తర్వాత వచ్చిన బాబు రూ.1.20 లక్షలకు యాదగిరికి చెక్కు ఇచ్చాడు. దీంతో ఎస్.ఎస్.బాబు చెప్పింది నిజమే అన్న నమ్మకం యాదగిరిలో పెరిగింది. ఆ తర్వాత బాబుకు మరో లక్ష ఇచ్చాడు. ‘ఎక్కువ మొత్తంలో పెట్టుబడి పెడితే ఎక్కువ లాభాలు వస్తాయి కదా' అని నమ్మించడంతో అప్పుచేసి మరో రూ.4 లక్షలు ఇచ్చేశాడు.
కొద్దికాలం తరువాత యాదగిరికి రూ.6.20 లక్షలకు బాబు చెక్ ఇచ్చాడు. దాన్ని తీసుకుని యాదగిరి ఆంధ్రాబ్యాంక్‌కు వెళితే ఖాతాలో డబ్బుల్లేవని వారు తిరస్కరించారు. ఇలా పలుమార్లు బ్యాంకుకు వెళ్లినా చెక్ ఆనర్ కాకపోవడం, మరోవైపు తనకు అప్పు ఇచ్చిన వారు ఒత్తిడి పెంచడంతో యాదగిరికి దిక్కుతోచలేదు. దీంతో ఎస్.ఎస్.బాబు వద్దకు వెళ్లి తన ఆవేదన వ్యక్తం చేస్తూ సొమ్ము ఇవ్వాలని కోరాడు. తనకు ఇన్‌స్పెక్టర్ తెలుసని, అప్పుల వాళ్లు ఒత్తిడి చేయకుండా తానే వారికి చెప్పిస్తానని నమ్మబలికాడు. అనంతరం సీఐ వద్దకు వెళ్లి ఓ ఉన్నతాధికారి పేరు చెప్పి తాను అతని మిత్రుడినని నమ్మించాడు. ఈ విధంగా ఆరు నెలలు గడిచిపోయాయి.
బాబు డబ్బులు ఇవ్వకుండా తిప్పుతుండడంతో యాదగిరి నిలదీశాడు. సొమ్ము ఇవ్వని బాబు యాదగిరిని బెదిరించడం మొదలుపెట్టాడు. యాదగిరి తెలివిగా ఓసారి సెల్ ఫోన్‌లో బాబుతో మాట్లాడుతూ దాన్ని రికార్డు చేశాడు. అదే సంభాషణను ఆధారం చేసుకుని చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌లో నిందితునిపై ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు గురువారం బాబును అరెస్టు చేశారు. అతనిపై గతంలోనూ పలు కేసులు ఉన్నట్లు గుర్తించారు.