ap dgp thakore: నిందితుడు పబ్లిసిటీ కోసమే జగన్ పై దాడి చేసినట్టు అనుమానిస్తున్నాం: ఏపీ డీజీపీ ఠాకూర్
- నిందితుడు శ్రీనివాస్ ను అదుపులోకి తీసుకున్నాం
- విశాఖ ఎయిర్ పోర్టులోనే అతను వెయిటర్
- నిందితుడి జేబులో పది పేజీల లేఖ ఉంది
విశాఖ ఎయిర్ పోర్ట్ లాంజ్ లో వైసీపీ అధినేత జగన్ పై దాడి చేసిన వ్యక్తి జనిపెల్ల శ్రీనివాస్ ను సీఐఎస్ఎఫ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారని ఏపీ డీజీపీ ఠాకూర్ తెలిపారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ముమ్మిడివరం మండలం ఠాణేలంకలోని పెదపేటకు చెందిన శ్రీనివాస్ ఏడాది కాలంగా ఈ ఎయిర్ పోర్ట్ లోనే వెయిటర్ గా పనిచేస్తున్నాడని చెప్పారు. జగన్ తో సెల్ఫీ దిగేందుకు వచ్చిన శ్రీనివాస్ తన ఎడమచేతితో ఈ దాడి చేశారని చెప్పారు.
జగన్ కు అభిమానినని శ్రీనివాస్ చెప్పుకుంటున్నాడని, అతని జేబులో పది పేజీల లేఖ ఉందని చెప్పారు. ఈ దాడి ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని, సీఐఎస్ఎఫ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని తెలిపారు. నిందితుడు పబ్లిసిటీ కోసమే ఈ దాడి చేసినట్టు అనుమానిస్తున్నామని అన్నారు. ఎయిర్ పోర్ట్ లోకి కత్తి ఎలా వెళ్లిందనే దానిపై దర్యాప్తు చేస్తున్నామని, ఎయిర్ పోర్ట్ లోపల భద్రత సీఐఎస్ఎఫ్ దేనని అన్నారు. నిందితుడి జేబులో ఉన్న లేఖలో సారాంశం గురించి త్వరలో వెల్లడిస్తామని ఠాకూర్ స్పష్టం చేశారు.