Mangalagiri: తొలిసారిగా రూ. కోటి దాటిన మంగళాద్రి పానకం వేలం!
- గణనీయంగా పెరుగుతున్న భక్తుల తాకిడి
- రూ. 1,08,09,999కు పానకం వేలం
- వచ్చే సంవత్సరం డిసెంబర్ 7 వరకూ హక్కులు
ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తరువాత, అమరావతికి అత్యంత సమీపంలో ఉన్న పుణ్యక్షేత్రంగా ఉన్న మంగళగిరి పానకాల స్వామికి భక్తుల తాకిడి గణనీయంగా పెరుగుతూ రాగా, ఈ సంవత్సరం పానకం వేలం రికార్డు స్థాయిలో కోటి రూపాయలను దాటింది. స్వామి ఆలయంలో పానకాల విక్రయ హక్కుల కోసం శ్రీకృష్ణదేవరాయ ముఖ మండపంలో టెండర్ కమ్ బహిరంగ వేలం నిర్వహించగా, గత సంవత్సరంతో పోలిస్తే రూ. 25 లక్షలు అదనంగా రూ. 1,08,09,999 ధర పలికింది.
పానకంతో పాటు కొబ్బరికాయలు, దీపారాధనలు, పూజాద్రవ్యాలు, ఆధ్యాత్మిక పుస్తకాలు, ఫొటోలు తదితరాలను విక్రయించేందుకు కూడా వేలం నిర్వహించారు. గత సంవత్సరం రూ. 82.90 లక్షలకు హక్కులను విక్రయించిన అధికారులు, ఈ సంవత్సరం భారీ మొత్తాన్ని రాబట్టడంలో సఫలం కావడంతో భక్తులు, సిబ్బంది హర్షం వ్యక్తం చేస్తున్నారు. వచ్చే సంవత్సరం డిసెంబర్ 7 వరకూ ఈ హక్కులు చెల్లుబాటులో ఉంటాయని ఆలయ అధికారులు తెలిపారు.
కాగా, మంగళగిరిలో స్వయంభువుగా వేంచేసివున్న పానకాలస్వామి నోటిలో భక్తులు పానకం పోయడం ఆనవాయతీ. ఎంత పానకం పోసినా, అందులో సగభాగాన్ని స్వామి తీసుకుని, మిగతా భాగాన్ని భక్తులకు తిరిగి ఇవ్వడం ఇక్కడి ప్రత్యేకత.