Rapar John James: షూటింగ్ ఫీట్.. విమానం రెక్కపై నడుస్తూ కిందపడి ప్రాణాలు కోల్పోయిన సంగీతకారుడు!
- ప్రమాదకర విన్యాసాలే గుర్తింపు తెచ్చిపెట్టాయి
- ప్రమాదకర ఫీట్‌ను ఎంచుకున్న రాపర్ జాన్ జేమ్స్
- ప్యారాచూట్ తెరిచే సమయం కూడా లేదు
ప్రమాదకర విన్యాసాలే తనకు చాలా గుర్తింపు తెచ్చిపెట్టాయి. చివరకు అవే ప్రాణాలు తీశాయి. ప్రముఖ కెనడియన్ రాపర్ జాన్ జేమ్స్ (33) బ్రిటిష్ కొలంబియాలోని వెర్నన్‌లో విమానం రెక్కపై నుంచి జారిపడి ప్రాణాలు కోల్పోయారు. తన మ్యూజిక్ ఆల్బమ్స్ కోసం ప్రమాదకర విన్యాసాలు చేస్తూ జేమ్స్ ఎంతో పేరు తెచ్చుకున్నారు. తాజాగా ఓ మ్యూజిక్ ఆల్బమ్ కోసం అత్యంత ప్రమాదకర ఫీట్‌ను ఎంచుకున్నారు.
ఎగురుతున్న విమానం రెక్కపై నడుస్తూ తన మ్యూజిక్ వీడియోను చిత్రీకరించాలనుకున్నారు. దీనికోసం జేమ్స్ శిక్షణ కూడా తీసుకున్నారు. తాజాగా చిత్రీకరణ ప్రారంభించారు. జేమ్స్ విమాన రెక్కపై నడుస్తూ చివరి వరకూ వెళ్లారు. అదే సమయంలో విమానం కాస్తా జేమ్స్ ఉన్న వైపు ఒరగడంతో పట్టుతప్పి జారి పడిపోయారు. ప్యారాచూట్ తెరిచే సమయం కూడా లేకపోవడంతో కిందపడి ప్రాణాలు కోల్పోయారని నిర్వాహకులు చెబుతున్నారు. ఈ ఘటనను అక్కడి పోలీసులు కూడా ధ్రువీకరించారు.