swamy paripurnananda: ధర్మ పరిరక్షణ కోసమే బీజేపీలో చేరాను: స్వామి పరిపూర్ణానంద
- అమిత్ షా మాటలతో నాకు రెట్టింపు ధైర్యం వచ్చింది
- నా ఆలోచనలే అమిత్ షా మాటల్లో కనిపించాయి
- మా భేటీలో ఎన్నో అంశాల గురించి చర్చించాం
ధర్మ పరిరక్షణ కోసమే తాను బీజేపీలో చేరానని శ్రీ పీఠం పీఠాధిపతి స్వామి పరిపూర్ణానంద అన్నారు. బీజేపీలో చేరిన తర్వాత తొలిసారి హైదరాబాద్ వచ్చిన పరిపూర్ణానంద మీడియాతో మాట్లాడుతూ, అమ్మవారి దీక్ష ముగిసిన అనంతరం పార్టీలో చేరానని అన్నారు. అమ్మవారి అనుమతి లభించకపోతే పార్టీలో చేరనని అమిత్ షాతో చెప్పానని, నవరాత్రులు పూర్తయిన తర్వాత ఢిల్లీ వస్తానని ఆయనతో చెప్పిన విషయాన్ని గుర్తుచేసుకున్నారు. అమిత్ షా తన స్వగృహానికి ఆహ్వానించి తనతో ఎంతో ప్రేమగా మాట్లాడారని, ఆయన మాటలతో తనకు రెట్టింపు ధైర్యం వచ్చిందని అన్నారు.
అమిత్ షాతో జరిపిన చర్చల్లో ఎన్నో అంశాల గురించిన ప్రస్తావన వచ్చిందని, తన ఆలోచనలే అమిత్ షా మాటల్లో కనిపించాయని చెప్పారు. తెలంగాణలో ఎన్నికల గురించి, పర్యటన ఎలా ఉండాలనే విషయం గురించి ఇక్కడి నేతలు చెబుతారని అమిత్ షా తనతో అన్నారని పరిపూర్ణానంద చెప్పారు. ఈ సందర్భంగా నేటి ‘రాజకీయం’ గురించి ఆసక్తికర నిర్వచనం చెప్పారు. ‘రా’ అంటే రావణుడు, ‘జ’ అంటే జరాసంధుడు, ‘కీ’ అంటే కీచకుడు, ‘య’ అంటే యముడు అని అభివర్ణించారు.