Virat Kohli: కోహ్లీ ఖాతాలో మరో అరుదైన రికార్డు.. వన్డేల్లో పదివేల పరుగులు దాటిన విరాట్
- అత్యంత వేగంగా ఈ మైలురాయి దాటిన కోహ్లీ
- 205 ఇన్నింగ్స్ ల్లోనే ఈ ఘనత సాధించిన విరాట్
- సచిన్ రికార్డ్ ని తిరగరాసిన వైనం
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మరో అరుదైన రికార్డు సృష్టించాడు. వన్డేల్లో అత్యంత వేగంగా 10 వేల పరుగుల మైలురాయి దాటిన బ్యాట్స్ మెన్ గా కోహ్లీ రికార్డు నెలకొల్పాడు. 213 వన్డేల్లోనే పది వేల పరుగుల మార్క్ ను కోహ్లీ అధిగమించాడు. కాగా, వన్డేల్లో 10 వేల పరుగుల మైలురాయి దాటిన 5వ భారత క్రికెటర్ విరాట్ కోహ్లీ. 10 వేల పరుగుల క్లబ్ లో ఇప్పటికే చోటు సంపాదించిన వారిలో సచిన్ టెండూల్కర్, గంగూలీ, ద్రవిడ్, ధోనీ ఉన్నారు. సచిన్ 266 వన్డేల్లో పదివేల పరుగులు పూర్తి చేశాడు. సచిన్ పేరిట ఉన్న రికార్డును కోహ్లీ అధిగమించడంతో ఆయన అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
విశాఖ వేదికగా విండీస్ తో ఈరోజు జరుగుతున్న రెండో వన్డేలో కోహ్లీ ఈ రికార్డు నెలకొల్పాడు. ఈ వన్డేలో 106 బంతుల్లో కోహ్లీ సెంచరీ చేశాడు. కోహ్లీ వన్డే కెరీర్ లో ఇది 37వ సెంచరీ.