CBI: సీబీఐ అధికారుల అవినీతిపై నిష్పాక్షిక విచారణ జరుపుతాం!: అరుణ్ జైట్లీ
- ఇద్దరు సీనియర్ అధికారులు ఆరోపణలు చేసుకున్నారు
- అందుకే వారిని తాత్కాలిక సెలవుపై పంపాం
- వర్మ, ఆస్థానాపై సిట్ విచారణ జరుపుతోంది
కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ)లో ముడుపుల వ్యవహారంపై నిష్పాక్షిక విచారణ జరుపుతామని కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు. సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మ, స్పెషల్ డైరెక్టర్ రాకేశ్ ఆస్థానాలు పరస్పరం అవినీతి ఆరోపణలు చేసుకోవడంతోనే ఇద్దరు అధికారులను సెలవుపై పంపామన్నారు. ఈ వ్యవహారంపై విచారణ జరిపేందుకు సరికొత్త బృందాన్ని నియమించామని వెల్లడించారు. ఇందులో సీబీఐ డీఐజీ తరుణ్ గోబా, ఎస్పీ సతీశ్ దాగర్, జాయింట్ డైరెక్టర్ వి.మురుగేశం సభ్యులుగా ఉంటారన్నారు.
సీబీఐ సంస్థ సమగ్రతను కాపాడటం ప్రభుత్వ బాధ్యతని అరుణ్ జైట్లీ వ్యాఖ్యానించారు. ఇద్దరు సీనియర్ అధికారులు ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకోవడం దురదృష్టకరమని అన్నారు. అలోక్ వర్మ, అస్థానాలపై కేసులను సిట్ బృందం విచారిస్తోందని తెలిపారు. ఈ విషయంపై చర్చించేందుకు కేంద్ర విజిలెన్స్ కమిషన్(సీవీసీ) నిన్న అత్యవసరంగా సమావేశమయిందన్నారు.
ఇద్దరు సీబీఐ అధికారులపై వస్తోన్న ఆరోపణలను ఏ ఏజెన్సీ అయినా విచారణ చేయవచ్చని సీవీసీ తమకు చెప్పిందన్నారు. ఇది తాత్కాలికంగా తీసుకున్న నిర్ణయం మాత్రమేననీ, సీవీసీ ప్రతిపాదన మేరకే ప్రభుత్వం వర్మ, అస్థానాలపై చర్య తీసుకుందని జైట్లీ పేర్కొన్నారు.