railway: సెకండ్ ఏసీ బోగీల్లో తొలగనున్న తెరలు...బ్లైండర్స్ ఏర్పాటు యోచనలో రైల్వేశాఖ
- అధికారుల నివేదిక మేరకు ఫస్ట్, థర్డ్ ఏసీల్లో గతంలోనే తొలగింపు
- తాజాగా ఈ నిబంధన సెకండ్ ఏసీకి వర్తింపు
- అగ్నిపమ్రాదాల సమయంలో తెరలవల్ల మంటలు వేగంగా విస్తరించే అవకాశం
సెకండ్ క్లాస్ ఏసీ బోగీల్లో ఇకపై తెరలు కనిపించవు. త్వరలోనే తెరలు తొలగించి వాటి స్థానంలో బ్లైండర్స్ ఏర్పాటు చేయాలని రైల్వే శాఖ నిర్ణయించింది. ప్రయాణికుల ఏకాంతానికి భంగం కలగకుండా ఉండాలన్న ఉద్దేశంతో ఏసీ బోగీల్లో తెరలు ఏర్పాటు చేశారు. అయితే రైల్వే అధికారుల బృందం ప్రయాణికుల భద్రత అంశంపై 2009లో చేసిన సర్వేలో ఈ తెరలపై అభ్యంతరం వ్యక్తమైంది. పొరపాటున అగ్నిప్రమాదం జరిగితే మంటలు బోగీలో వేగంగా విస్తరించేందుకు ఈ తెరలు మరింత కారణమవుతాయని తన నివేదికలో పేర్కొంది.
దీనికితోడు ఈ తెరలను ప్రయాణికులు తమ సొంత అవసరాలకు వాడి పాడుచేస్తున్నారన్న ఫిర్యాదులు ఉన్నాయి. ముఖ్యంగా భోజనం చేశాక చెయ్యి కడుక్కుని ఈ తెరలతోనే తుడుస్తున్నారని, కొందరు తమ షూస్, చెప్పులు తుడవడానికి కూడా ఈ తెరలను వాడుతున్నారని అధికారుల దృష్టికి వచ్చింది. దీనివల్ల తెరలు మురికిగా మారడం, దుర్వాసన రావడంతో ప్రయాణికులు తరచూ ఫిర్యాదు చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో భద్రతాపరమైన నిబంధన కూడా కలిసి రావడంతో అధికారులు ఫస్ట్ క్లాస్, థర్డ్ క్లాస్ ఏసీ బోగీల్లో తెరలను తొలగించారు. తాజాగా సెకండ్ క్లాస్ బోగీల్లోని తెరలను తొలగించాలని నిర్ణయించారు. దక్షిణ మధ్య రైల్వే పరిధిలోనే ప్రతి రోజూ 110 రైళ్లు తమ గమ్యస్థానాలకు బయలుదేరుతుంటాయి. ఇందులో దాదాపు 12 వేల మంది ప్రయాణిస్తుంటారు. వీరిలో దాదాపు 20 శాతం మంది ఏసీ ప్రయాణికులు ఉంటారని అంచనా. తెరల స్థానంలో బ్లైండర్లు ఏర్పాటు చేసినా వీరి నుంచి వ్యతిరేకత వ్యక్తం కాకపోవచ్చని రైల్వే వర్గాలు భావిస్తున్నాయి.