Andhra Pradesh: నేను వైసీపీలోనో, టీడీపీలోనో చేరబోతున్నట్లు సోషల్ మీడియాలో కథనాలు రాశారు!: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణ
- ఐదు నెలలు ఏపీ అంతటా పర్యటించా
- ప్రజా సమస్యలు తెలుసుకున్నాను
- బీజేపీ, ఆప్ నుంచి ఆఫర్లు వచ్చాయి
ఆంధ్రప్రదేశ్ అంతటా గత 5 నెలలుగా తాను పర్యటించానని సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీ నారాయణ తెలిపారు. రాష్ట్ర పర్యటనలో ప్రజల సమస్యలు, జరిగిన అభివృద్ధిని తెలుసుకునే అవకాశం తనకు లభించిందని చెప్పారు. రైతులు, వైద్యం, నిరుద్యోగ సమస్యలు ఏపీని వేధిస్తున్నాయని వ్యాఖ్యానించారు. ఈ రోజు ఓ మీడియా సంస్థతో లక్ష్మీ నారాయణ మాట్లాడారు.
ప్రస్తుత వ్యవస్థలో మార్పు తీసుకురావాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు. తన పర్యటనలో గుర్తించిన విషయాలను సీఎం చంద్రబాబుకు త్వరలోనే అందజేస్తానని వెల్లడించారు. ప్రజా సమస్యలను పరిష్కరించడానికి తాను రాజకీయాల్లోకి వస్తానని పునరుద్ఘాటించారు. తన ఆలోచనా విధానానికి అనుకూలంగా ఉండేవారితో కలిసి పనిచేస్తానన్నారు. మిత్రులు, శ్రేయోభిలాషులతో చర్చించి ఈ విషయమై వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకుంటానని స్పష్టం చేశారు.
ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీ నుంచి తమ పార్టీలోకి చేరాలని ఆహ్వానాలు వచ్చాయని లక్ష్మీ నారాయణ తెలిపారు. సీబీఐ నుంచి తప్పుకోగానే తనను కొందరు చాలా పార్టీలకు అంటగడుతూ వార్తలు రాశారని ఆయన అన్నారు. టీడీపీలోనో, వైసీపీలోనో చేరబోతున్నట్లు తనపై సోషల్ మీడియాలో ఇష్టానుసారం వార్తలు రాశారన్నారు. సీబీఐ నుంచి బయటకు వచ్చి సరైన నిర్ణయమే తీసుకున్నానని లక్ష్మీ నారాయణ స్పష్టం చేశారు. వీలైనంత త్వరగా తన రాజకీయ కార్యాచరణను ప్రకటిస్తానని ఆయన తెలిపారు.