New Delhi: ముదిరిన సీబీఐ వ్యవహారం.. సుప్రీంకోర్టును ఆశ్రయించిన డైరెక్టర్ అలోక్ వర్మ!
- అకారణంగా సెలవుపై పంపారని ఆవేదన
- తానేమీ తప్పు చేయలేదని వెల్లడి
- విచారణ చేపట్టేందుకు అంగీకరించిన సుప్రీంకోర్టు
కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ)లో డైరెక్టర్ అలోక్ వర్మ, స్పెషల్ డైరెక్టర్ రాకేశ్ అస్థానాల వివాదం మరింత ముదిరడంతో, వీరిద్దరినీ విధుల నుంచి తాత్కాలికంగా తప్పిస్తూ సెలవుపై వెళ్లాలని కేంద్రం ఆదేశించిన సంగతి తెలిసిందే. సీబీఐ తాత్కాలిక డైరెక్టర్ గా తెలుగు వ్యక్తి మన్నెం నాగేశ్వరరావును ఈ సందర్భంగా కేంద్రం నియమించింది. అయితే తనను అకారణంగా తొలగించారని చెబుతూ అలోక్ వర్మ ఈ రోజు సుప్రీం కోర్టును ఆశ్రయించారు.
ఎలాంటి తప్పు లేకపోయినా ప్రభుత్వం తనను బాధ్యతల నుంచి తప్పించిందని అలోక్ వర్మ కోర్టుకు తెలిపారు. కనీస సమాచారం ఇవ్వకుండా రాత్రికిరాత్రే నిర్ణయం తీసుకున్నారని వెల్లడించారు. ఈ మేరకు అలోక్ వర్మ తరఫున సీనియర్ న్యాయవాది గోపాల సుబ్రహ్మణ్యం దాఖలు చేసిన పిటిషన్ ను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంగన్ గొగోయ్ నేతృత్వంలోని బెంచ్ అత్యవసరంగా విచారించేందుకు అంగీకరించింది.
ఈ సందర్భంగా పిటిషన్ ను విచారణకు స్వీకరించిన ధర్మాసనం శుక్రవారం పూర్తిస్థాయిలో విచారణ చేపడతామని స్పష్టం చేసింది. అవినీతికి పాల్పడ్డారని సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మ, స్పెషల్ డైరెక్టర్ రాకేశ్ అస్థానా పరస్పరం ఆరోపణలు, గుప్పించుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాకేశ్ అస్థానాపై సీబీఐ స్వయంగా కేసు నమోదు చేయడంతో అసలు వ్యవహారం ముదిరింది. దీంతో ఇద్దరు అధికారులను తన కార్యాలయానికి పిలిపించుకున్న ప్రధాని మోదీ చివాట్లు పెట్టారు. అయినా పరిస్థితి మారకపోవడంతో నిన్న అర్థరాత్రి ఇద్దరిని సెలవుపై పంపుతూ కేంద్రం ఉత్తర్వులు జారీచేసింది.