Andhra Pradesh: 2019లో గెలుపు గుర్రాలకే టికెట్లు ఇస్తాం.. మిగతా నేతలకు ప్రత్యామ్నాయ బాధ్యతలు అప్పగిస్తాం!: సీఎం చంద్రబాబు
- టీడీపీ సభ్యత్వాలు కోటికి చేరుకోవాలి
- ఐటీ దాడులతో భయోత్పాతం సృష్టించారు
- సీబీఐ లో తీవ్రమైన గందరగోళం నెలకొంది
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఈ రోజు టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ సభ్యత్వం ప్రస్తుతం 64 లక్షలుగా ఉందనీ, ఇది కోటికి చేరుకునేలా కృషి చేయాలని నేతలు, కార్యకర్తలకు సూచించారు. ఈ నెల 31 నుంచి అన్ని గ్రామాల్లో సభ్యత్వ నమోదు కార్యక్రమాలు ముమ్మరం చేయాలని ఆదేశించారు.
కార్యకర్తలే తెలుగుదేశం పార్టీ బలమనీ, గత నాలుగేళ్లుగా ఎలాంటి సమస్యలొచ్చినా పట్టుదలతో అధిగమించామని చంద్రబాబు వ్యాఖ్యానించారు. శ్రీకాకుళం జిల్లాలో తిత్లీ తుపాను పెను విధ్వంసం సృష్టించినా కేవలం 11 రోజుల్లో సాధారణ పరిస్థితులు తీసుకొచ్చామన్నారు. నాలుగేళ్లు కేంద్రంలో అధికారం అప్పగిస్తే అన్ని వ్యవస్థలను బీజేపీ నాశనం చేసిందని చంద్రబాబు ఆరోపించారు.
సీబీఐ సహా చాలా కేంద్ర సంస్థల్లో ఇప్పుడు తీవ్రమైన గందరగోళం నెలకొని ఉందని వ్యాఖ్యానించారు. ఐటీ దాడుల పేరుతో రాష్ట్రంలో భయోత్పాత పరిస్థితిని సృష్టించారని మండిపడ్డారు. జాతీయ స్థాయి రాజకీయాల్లో టీడీపీ కీలకపాత్ర పోషించాలని చంద్రబాబు ఆకాంక్షించారు. ఏ ఎన్నికలు వచ్చినా టీడీపీదే గెలుపు అయ్యేలా నేతలు పనిచేయాలన్నారు.
వచ్చే ఎన్నికల్లో గెలుపు గుర్రాలకే టికెట్లు ఇస్తామనీ, మిగతా నేతలకు ప్రత్యామ్నాయ బాధ్యతలు అప్పగిస్తామని చంద్రబాబు వెల్లడించారు. మూడు ఎమ్మెల్సీ స్థానాలకు జరగనున్న ఎన్నికలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని సూచించారు.