student murder: ఆశ్రమ పాఠశాలలో నాలుగో తరగతి విద్యార్థి అనుమానాస్పద మృతి
- రక్తమోడిన మృతదేహం ట్రంకు పెట్టెలో గుర్తింపు
- ఖమ్మం గిరిజన రెసిడెన్షియల్ పాఠశాలలో ఘటన
- ఆగ్రహంతో విద్యాలయంపై దాడిచేసిన విద్యార్థి సంఘాల ప్రతినిధులు, కుటుంబ సభ్యులు
పదేళ్లకే ఆ బిడ్డకు నూరేళ్లు నిండిపోయాయి. కొడుకు బంగారు భవిష్యత్తు ఊహించుకుని తాత్కాలికంగా దూరమైనా పర్వాలేదనుకుని ఆశ్రమ పాఠశాలలో చేరిస్తే ఆ బిడ్డ చావు వార్త వినాల్సి రావడంతో ఆ తల్లిదండ్రుల వేదన వర్ణనాతీతం. హత్యో...మరో కారణమో స్పష్టంగా తెలియకున్నా బిడ్డ దూరం కావడంతో తల్లిదండ్రులకు పుట్టెడు దు:ఖం మిగిలింది. ఖమ్మం జిల్లా కేంద్రంలో ఓ గిరిజన ఆశ్రమ పాఠశాల విద్యార్థి అనుమానాస్పద మృతి తీవ్ర కలకలం రేపింది.
వివరాల్లోకి వెళితే...ఖమ్మంలోని ఖానాపురానికి చెందిన దేవత్ రవి, పర్వీన్ కుమారుడు దేవత్ జోసఫ్ (10) గిరిజన ఆశ్రమ పాఠశాలలో నాలుగో తరగతి చదువుతున్నాడు. మంగళవారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో జోసఫ్ రక్తమోడి విగతజీవిగా పడివుండడాన్ని గమనించిన తోటి విద్యార్థులు వసతి గృహం సంక్షేమాధికారి ప్రతాప్‌సింగ్, ఇతర ఉపాధ్యాయులకు తెలిపారు. వారు వచ్చి చూడగా పదో తరగతి విద్యార్థులుండే గదిలోని ఓ ట్రంకు పెట్టెలో సగం, బయట సగం ఉన్న మృతదేహాన్ని గుర్తించారు. ముఖం, శరీరం రక్తమోడి ఉండడంతో పోలీసులకు సమాచారం అందించారు.
ఘటనా స్థలిని సందర్శించిన పోలీసులు విచారణ జరిపి ఇదే పాఠశాలలో చదువుతున్న పదో తరగతి విద్యార్థిని అదుపులోకి తీసుకున్నారు. ఘటన వెలుగులోకి వచ్చిన కొద్దిసేపటికి ముందే ఈ పదో తరగతి విద్యార్థి, జోసఫ్‌ను సైకిల్‌పై బయటకు తీసుకువెళ్లాడని, ఆ తర్వాత తిరిగి ఎప్పుడు వచ్చారో చూడలేదని పాఠశాల విద్యార్థులు చెప్పడంతో టెన్త్ విద్యార్థే హత్య చేసి ఉంటాడేమోనని పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.
కాగా, ఈ ఘటనతో కోపోద్రిక్తులైన మృతుని కుటుంబ సభ్యులు, బంధువులు, విద్యార్థి సంఘాల నాయకులు పాఠశాలపై దాడిచేసి ఫర్నీచర్ ధ్వంసం చేశారు. వసతి గృహం సంక్షేమాధికారితోపాటు డీటీడీఓ, ఏటీడీఓ ల పర్యవేక్షణ సక్రమంగా లేకే ఇటువంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణం వారిని సస్పెండ్ చేయాలని ఆందోళనకు దిగారు.